రన్‌వేపై సూసైడ్‌?? షాకింగ్‌ వీడియో వెలుగులోకి.. | What happened Colorado Denver Airport Runway video Viral | Sakshi
Sakshi News home page

రన్‌వేపై సూసైడ్‌?? షాకింగ్‌ వీడియో వెలుగులోకి..

May 11 2026 12:57 PM | Updated on May 11 2026 1:05 PM

What happened Colorado Denver Airport Runway video Viral

అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదం తాలుకా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఓ వ్యక్తి రన్‌వేపైకి దూసుకురాగా.. విమానం అతన్ని ఢీ కొట్టి ఇంజిన్‌లోకి లాగేసింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే అతను ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కొలరాడో స్టేట్‌ డెన్వర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులతో లాస్ ఏంజెల్స్‌కి బయల్దేరిన ఫ్రంటియర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం(Airbus A321).. రన్‌వేపై వేగంగా దూసుకెళ్తూ హఠాత్తుగా పెద్ద శబ్దం చేస్తూ ఆగిపోయింది. దీంతో విమానంలో మంటలు వ్యాపించాయి. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు ఎమర్జెన్సీ స్టయిడ్స్‌ ద్వారా అందరినీ బయటకు తెచ్చారు. 12 మందికి స్వల్పగాయాలు కాగా.. మరో ఐదుగురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ వెంటనే..

రన్‌వేను మూసేసి దర్యాప్తు ప్రారంభించారు. రన్‌వేపై దూసుకెళ్తు‍న్న సమయంలో బిగ్గరగా శబ్దం వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. ఓ వ్యక్తిని ఢీ కొట్టినట్లు పైలట్‌ చెప్పాడు. దీంతో విమానం ఇంజిన్‌ నుంచి ఓ మృతదేహాన్ని వెలికి తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. రన్‌వేపై జరిగిన ప్రమాదంలోనే అతను జరిగి ఉంటాడని భావించారంతా. ఈ నేపథ్యంలో షాకింగ్‌ వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.

ఆ వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది కాదని అధికారులు తేల్చేశారు. ‘‘దొడ్డిదారిన ఎయిర్‌పోర్ట్‌ ఫెన్సింగ్‌ దూకిన ఓ వ్యక్తి.. రన్‌వేపై ఠీవిగా నడుచుకుంటూ వస్తున్నాడు.  ఆ సమయంలోనే 180 మైళ్ల వేగంతో దూసుకొచ్చిన విమానం అతన్ని ఢీ కొట్టింది. ఆ వెంటనే అతన్ని ఇంజిన్‌లోకి లాగేయడంతో.. మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. రన్‌వేపై విమానం దూసుకు రావడం అతను గమనించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని.. బహుశా ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే వచ్చి ఉంటాడు’’ అని డెన్వర్‌ పోలీసులు ప్రకటించారు.

ఫెన్సింగ్‌ దూకిన రెండు నిమిషాల్లోనే అతని ప్రాణాలు పోయాయి. అతను ఎవరనేది తేలితేనే.. ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుంది అని ఓ అధికారి చెబుతున్నారు. మరోవైపు.. ఉగ్ర దాడి, ప్రమాదవశాత్తూ మరణం కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ షాకింగ్‌ వీడియోను మీరూ చూసేయండి..

 

Advertisement
 
Advertisement
Advertisement