
నేపాల్‌లో సోషల్ మీడియా యాప్‌లపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించిన దరిమిలా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ ఆందోళనల్లో ‘జెన్ జెడ్’ కీలక భాగస్వామ్యం కనిపించింది. ఇంతకీ జెన్ జెడ్ అంటే ఏమిటి? 1995 నుంచి 2012 మధ్య జన్మించిన పిల్లలను ‘జనరేషన్ జెడ్’ (జెన్ జెడ్) అని పిలుస్తారు. అధునాతన స్మార్ట్‌ఫోన్‌లు విరివిగా వినియోగించే ఇంటర్నెట్ యుగంలో జన్మించినవారే జెన్ జెడ్ కేటగిరీకి చెందినవారు. వీరు ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారు ఆన్‌లైన్‌లో స్నేహితులను కలుసుకోవడానికి, భౌతికంగా స్నేహితులను కలుసుకోవడానికి తేడా లేదని చెబుతుంటారు.
డిజిటల్ ప్రపంచమే తమ లోకం
ఒక అమెరికన్ ఇన్స్టిట్యూట్ తెలిపిన వివరాల ప్రకారం, 1995 నుంచి 2012 మధ్య జన్మించిన పిల్లలను ‘జనరేషన్ జెడ్’ అని అంటారు. వీరు అధునాతన స్మార్ట్‌ఫోన్‌లు విరివిగా వినియోగించే ఇంటర్నెట్ యుగంలో జన్మించారు. ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధిని పరిశీలిస్తే, అది 1995 సంవత్సరం తర్వాత అత్యంత వేగంగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌లు, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌లు విరివిగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో పుట్టిన చిన్నారులు సాంకేతికంగా మరింత ముందడుగు వేస్తారని నిపుణులు అంటున్నారు. ఇంతేకాదు మునుపటి తరంతో పోలిస్తే, జెన్ జెడ్ కేటగిరీకి చెందినవారు మరింత స్నేహశీలురుగా మెలుగుతూ, ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారని చెబుతున్నారు. మాట తీరు ఇంతకుముందు తరాలకు భిన్నంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాంకేతికను విరివిగా వినియోగిస్తూ..
జనరేషన్ జెడ్.. సంక్షిప్తంగా జెన్ జెడ్.. వ్యవహారికంగా జూమర్స్ అని ప్రస్తుత తరం యువతను పిలుస్తున్నారు. ఈ తరంలో జన్మించినవారు అంతకుముందు తరాలవారి వ్యవహరశైలికి భిన్నంగా ఉంటున్నారు. వీరి విద్యాభ్యాసం విషయానికొస్తే తమ ముందు తరాల కంటే కొంత భిన్నమైన విద్యావిధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం జెన్ జెడ్ తరం వారు హైస్కూలు మొదలుకొని ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారిగా ఉన్నారు. వీరు ఆన్‌లైన్‌లో స్నేహితులను కలుసుకోవడానికి, భౌతికంగా స్నేహితులను కలుసుకోవడానికి మధ్య పెద్దగా తేడా చూపరు. ఈ కారణంగానే వారు అధికస్థాయిలో స్నేహితులను సంపాదించుకుంటున్నారు. ఇందుకు సాంకేతికను విరివిగా ఉపయోగిస్తున్నారు.
లాక్‌డౌన్‌లోనూ ఎంజాయ్..
జెన్ జెడ్ డిజిటల్ ప్రపంచాన్ని అభివృద్ధి చేయడంతోపాటు దానిని స్వీకరించిన మొదటి తరం. ఈ తరం డిజిటల్ ప్లాట్‌ఫారాలకు, సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంటుంది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో మిగిలిన తరాల వారు ఎంతో ఇబ్బంది పడినా జెన్ జెడ్ వర్గం వారు దానిని కష్టసమయంగా భావించలేదు. ఇంటర్నెట్ సహాయంతో వారు అనేక విషయాలు తెలుసుకున్నారు. మిగిలిన తరాలకు భిన్నంగా ఆలోచిస్తూ జెన్ జెడ్ వర్గంవారు ముందుకు దూసుకుపోతున్నారు. మిగిలిన తరాల కన్నా జెన్ జెడ్‌వర్గం తక్కువ ఒత్తిడికి గురవుతున్నదని పరిశోధనల్లో తేలింది.