ఇజ్రాయెల్‌కు అమెరికా విమాన వాహక నౌక.. ఇక హమాస్‌కు చుక్కలే? | US President Joe Bide Sends Warships To Support Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌కు అమెరికా విమాన వాహక నౌక.. ఇక హమాస్‌కు చుక్కలే?

Oct 9 2023 8:48 AM | Updated on Oct 9 2023 10:19 AM

US President Joe Bide Sends Warships To Support Israel - Sakshi

టెల్‌ అవివ్‌/జెరూసలేం:  ఇజ్రాయెల్‌ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్‌ సంస్థ హమాస్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ ఇజ్రాయెల్‌లో పరిస్థితి భీతావహంగా మారింది. హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. గాజా నుంచి ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన తీవ్రవాదులు వీధుల్లో జవాన్లతో తలపడుతున్నారు. హమాస్‌ దుశ్చర్య పట్ల ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌ సైన్యం పెద్ద సంఖ్యలో రాకెట్లను గాజాపై ప్రయోగించింది.

మరోవైపు.. ఇజ్రాయెల్‌కు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతానికి విమాన వాహక నౌకను పంపాలని అమెరికా నిర్ణయించింది. ఫోర్డ్‌ క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ అక్కడికి వెళ్లాలని ఆదివారం పెంటగాన్‌ ఆదేశించినట్లు ఇద్దరు అమెరికా అధికారులు వెల్లడించారు. 5వేల నావికులు, యుద్ధ విమానాలతో కూడిన ద యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ వాహక నౌకను, క్రూజ్‌లను, డిస్ట్రాయర్స్‌ను పంపనున్నట్లు తెలిపారు. 

ఇది ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడంతోపాటు హమాస్‌కు అదనపు ఆయుధాలను సమకూర్చే వారిపై నిఘా ఉంచనుంది. వర్జీనియా కేంద్రంగా ఉండే ఈ విమాన వాహక నౌక ప్రస్తుతం మధ్యధరా సముద్ర ప్రాంతంలోనే ఉంది. నౌకా విన్యాసాల కోసం ఈ ప్రాంతానికి వచ్చింది. ఈ గ్రూప్‌లో క్రూజ్‌ యూఎస్‌ఎస్‌ నార్మండీ, డిస్ట్రాయర్లు యూఎస్‌ఎస్‌ థామస్‌ హడ్నర్‌, యూఎస్‌ఎస్‌ రాంపేజ్‌, యూఎస్‌ఎస్‌ క్యార్నీ, యూఎస్‌ఎస్‌ రూజ్‌వెల్ట్‌తోపాటు ఎఫ్‌-35, ఎఫ్‌-15, ఎఫ్‌-16, ఏ-10 యుద్ధ విమానాలు ఉంటాయి.

ఇక, ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇవ్వడంపై టర్కీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. అనవసరంగా ఈ విషయంలో తలదూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చింది. 

ఇదిలా ఉండగా.. యుద్ధం తీవ్రతరం కావడం వల్ల మరణించిన వారి సంఖ్య 1,100 దాటింది. ఇజ్రాయెల్‌లో 700 మందికి పైగా మరణించారు. గాజాలో కనీసం 400 మంది మరణించినట్టు సమాచారం. ఇరువైపులా 2,000 మంది చొప్పున గాయపడినట్లు తెలుస్తోంది. తమ సైనిక దళాలు 400 మంది హమాస్‌ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ అధికార వర్గాలు తెలియజేశాయి. చాలామందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి.

బందీలపై తీవ్రవాదుల అత్యాచారాలు  
హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లో బీభత్సం సృష్టించారు. ఇజ్రాయెల్‌ పౌరులను బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. వీరిలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉండడం గమనార్హం. ఈ బందీలను అడ్డం పెట్టుకొని పెద్ద బేరమే ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేలాది మంది పాలస్తీనావాసులు ఖైదీలుగా ఇజ్రాయెల్‌ ఆ«దీనంలో ఉన్నారు. వీరిని విడిపించుకోవడానికి మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ బందీలను పావులుగా ప్రయోగించబోతున్నట్లు సమాచారం. ఇంకోవైపు చాలామంది ఇజ్రాయెల్‌ పౌరులను మిలిటెంట్లు అపహరించినట్లు ప్రచారం సాగుతోంది.     


భారతీయులు క్షేమం..
ఇజ్రాయెల్, గాజాలో భారతీయులంతా ఇప్పటిదాకా క్షేమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారికి ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారు.  భారతీయులకు తాము అందుబాటులో ఉంటున్నామని, వారి తగిన సలహాలు సూచనలు ఇస్తున్నామని భారత రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశాయి. మరోవైపు గాజాలో వాతావరణం భయంకరంగా ఉందని అక్కడి భారతీయులు చెప్పారు.  ఇంటర్నెట్, విద్యుత్‌ సౌకర్యం పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.  ఇలా ఉండగా, ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌కు ఈ నెల 14 దాకా తమ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement