
న్యూఢిల్లీ: భారతదేశం పై అమెరికా 50 శాతం సుంకాలు అమలు చేయడంపై ఇండియాలోని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు విధించింది. తాజాగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈ సుంకాల విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని, పరిస్థితులు ఎలా ఉన్నా, తాము కలిసే పనిచేస్తామని పేర్కొన్నారు. సుంకాల అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు.
భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను అమెరికా బుధవారం (ఆగస్టు 27) నుంచి వీటిని అమలు చేస్తోంది. రష్యా నుంచి ఇకపై ముడి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా భారత్‌కు సూచించింది. అయితే భారత్.. అమెరికా మాటను లెక్క చేయలేదు. దీంతో అమెరికా అదనపు సుంకాలతో బెదిరింపులకు దిగింది. సుంకాలు అమలవుతున్న సమయంలో అమెరికా ఆర్థిక మంత్రి సామరస్య పూర్వక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా విధించిన అదనపు సుంకాల కారణంగా భారత్‌లోని పలు కంపెనీలు మూతపడతాయని, లక్షల మంది ఉపాధి కోల్పోతారనే వాదన వినిపిస్తోంది. తాజాగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ .. పరిస్థితులు ఎలా ఉన్నా సరే అమెరికా, ఇండియా చివరకు కలిసి పని చేస్తాయని పేర్కొనడం గమనార్హం. బెసెంట్ ఓ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా, భారత్ మధ్య ఇంకా వాణిజ్య ఒప్పందం పూర్తి కాలేదన్నారు. ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైతే.. అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశమన్నారు. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు ఎలా ఉన్నా చివరకు అమెరికా, ఇండియా కలిసి పని చేస్తాయని స్పష్టం చేశారు.
అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఉన్నత స్థాయి సంబంధాలన్నాయని, అమెరికా విధించిన సుంకాల మీద చర్చలు జరిపేందుకు భారత్ వెంటనే ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. అయినా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదని, మే, జూన్ నాటికి ఇరు దేశాలు ఓ అభిప్రాయానికి వస్తాయని భావించామన్నారు. అయితే డీల్ ఇంకా పూర్తి కాలేదన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం కారణంగా ఇండియా లాభాలు ఆర్జిస్తున్నదన్నారు. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి పడిపోయిందన్నారు. త్వరలోనే సుంకాల అంశంపై ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉందన్నారు.