వామ్మో వాంపైర్‌: మెడచుట్టూ కొడవలి.. కాలికి తాళం.. బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు!

Unusual Vampire Remains Found At Poland Cemetery - Sakshi

ఈ భూమ్మీద కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ప్రత్యేకించి.. ‘అంతుచిక్కని’ మిస్టరీలుగా భావించే వాటిని చేధించేందుకు నిరంతరం పరిశోధకులు కృషి చేస్తూనే ఉన్నారు. తాజాగా.. అలాంటి లిస్ట్‌ నుంచి ఓ మిస్టరీని చేధించే యత్నాల్లో ఒక ‘క్లూ’ చిక్కింది. ఆడ వాంపైర్‌(రక్తపిశాచి) అస్థిపంజరం ఒకటి అసాధారణ రీతిలో తవ్వకాల్లో బయటపడింది. 

యూరప్‌ దేశం పోలాండ్‌లోని ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్‌ అనే గ్రామంలోని ఓ స్మశానానికి ఆనుకుని ఉన్న నిర్జన ప్రదేశంలో ఈ వ్యాంపైర్‌ సమాధిని గుర్తించారు. టోరన్‌లోని నికోలస్‌ కోపర్నికస్‌ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది. అది 17వ శతాబ్దానికి చెందిన ఒక యువతి అస్థిపంజరంగా నిర్ధారించుకున్నారు. మెడ చుట్టురా కొడవలి చుట్టి, ఆమె ఎడమ పాదం బొటనవేలుకి తాళం వేసి ఉంది. ఆగష్టులోనే ఈ అస్థికలు బయటపడ్డప్పటికీ.. తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీ, ఫొటోలు బయటపెట్టారు. 

వ్యాంపైర్‌ అంటే.. కోరల్లాంటి పళ్లతో రక్తం పీల్చి బతికే పిశాచి. పగలు సాధారణం రూపం లేదంటే అసలుకే కనిపించకుండా తిరుగుతూ.. రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ వేటాడుతుంది. మెడపై వ్యాంపైర్‌ గనుక కొరికితే.. అవతలి వాళ్లూ వ్యాంపైర్‌లుగా మారిపోతారని, లేదంటే ఎముకల గూడుగా మిగిలిపోతారని.. చాలా కథల్లో, సినిమాల్లో చూసే ఉంటారు. కానీ, వ్యాంపైర్ల ఉనికి, మనుగడ అనేది ఇప్పటిదాకా కేవలం జానపద కథలుగానే, ఫిక్షన్ క్యారెక్టర్‌గానే ప్రచారంలో ఉంది. చాలామందికి అదొక నమ్మకంగానే మిగిలిపోయింది.

పరిశోధకులు ఏమన్నారంటే.. 17వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రపంచంలో మూఢనమ్మకాలు తారాస్థాయిలో ఉండేవి. బహుశా.. ఆ యువతిని వాంపైర్‌గా అనుమానించి అంత ఘోరంగా చంపేసి ఉంటారు. ఆమెను వ్యాంపైర్‌గా భావించి.. ఎక్కడ సమాధి నుంచి లేచి వస్తుందో అనే భయంతో మెడలో కొడవలిని అలాగే ఉంచేశారు. ఒకవేళ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే.. తల తెగిపోతుందని అలా చేసి ఉంటారు. అలాగే ఆమె పాదానికి తాళం కూడా వేశారు. ఆరోజుల్లో మూఢనమ్మ​కాలు అలా ఉండేవి’’ అని తెలిపారు ఈ పరిశోధనకు నేృతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్‌ డారియుస్జ్‌ పోలిన్‌స్కి. అయినప్పటికీ తమ పరిశోధన ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. అయితే.. 

 

గతంలో యూరప్‌ తూర్పు ప్రాంతంలోనూ ఈతరహా సమాధులు చాలానే బయటపడ్డాయి. వాటిలో చాలావరకు ఈ తరహాలోనే పాతిపెట్టబడ్డప్పటికీ.. తలలు, కాళ్లు చేతులు, తల తిప్పేసి ఉండడం, లేదంటే తల పూర్తిగా ధ్వంసమై ఉండడం లాంటి పరిస్థితుల్లో బయటపడ్డాయి. వాస్తవ-అవస్తవాలను పక్కనపెడితే.. వ్యాంపైర్‌ ప్రపంచం గురించి పరిశోధిస్తున్నవాళ్లకు.. ప్రత్యేకించి రచయితలకు ఈ అస్థికలు బయటపడడం మాత్రం ఓ కుతూహలాన్ని రేపుతోంది.

ఇదీ చదవండి: క్వీన్‌ ఎలిజబెత్ మరణం.. ఆకాశంలో అద్భుతం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top