వాషింగ్టన్: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో తమకు మద్దతు ఇవ్వడంలో వెనుకంజ వేసిన మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేశారు. ఇరాన్ ప్రభుత్వాన్ని పూర్తిగా కూల్చేస్తే లేదా అంతం చేస్తే ఏమవుతుందో అని తాను ఆలోచిస్తున్నానని చెప్పారు. అమెరికా సైనికంగా ఇరాన్‌పై దాడి చేసి, అక్కడి ప్రస్తుత పాలనా వ్యవస్థనే పూర్తిగా తొలగిస్తే పరిస్థితి ఎలా మారుతుందో అన్న భావనను వ్యక్తం చేస్తూ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
హార్మూజ్ జలసంధిపై మిత్రదేశాలు స్పందించడం లేదని ట్రంప్ అన్నారు. హార్మూజ్ జలసంధిని “సో కాల్డ్ స్ట్రైట్” అని పేర్కొన్నారు. ఆ మార్గంపై అసలు అమెరికా ఆధారపడదని, వేరే దేశాలే ఆధారపడతాయని చెప్పారు.
ఇరాన్‌ను ఉగ్రవాద దేశం అంటూ ట్రంప్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మిగిలిన వాటిని కూడా తాము పూర్తిగా ధ్వంసం చేస్తే ఏమవుతుందోనని తాను ఆలోచిస్తున్నాని చెప్పారు. అలాగే, హార‍్మూజ్ జలసంధి మార్గంపై ఆధారపడే దేశాలు దాన‍్ని రక్షించుకునే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఆ జలసంధి బాధ్యతను అమెరికాకు ఇవ్వకుండా ఆ పని చేయాలని మిత్రదేశాలకు చెప్పారు. అమెరికా ఇలా వెనక్కి తగ్గితే, ప్రస్తుతం సాయం చేయని మిత్రదేశాలు కూడా వెంటనే కదిలి హార్మూజ్‌ను కాపాడుకునే బాధ్యతల్లో పాల్గొనాల్సి వస్తుందని ట్రంప్ అంటున్నారు.
కాగా, పశ్చిమాసియా ఘర్షణ మధ్య ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యల్లో కలిసి పాల్గొనడానికి కొన్ని నాటో దేశాలు నిరాకరించాయి. నాటో దేశాలపై కూడా ట్రంప్ మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. “మా నాటో మిత్రదేశాలు ఇరాన్‌పై సైనిక చర్యల్లో పాల్గొనాలనుకోవడం లేదని అమెరికాకు తెలియజేశాయి. అయినా, ఇరాన్‌కు అణ్వాయుధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని దాదాపు ప్రతి దేశం అంగీకరించింది” అని ఆయన పోస్టులో పేర్కొన్నారు.


