ప్రపంచంలోనే ఖరీదైన పెంపుడు జంతువులు ఇవే

There Are Most Expensive Pets In The World - Sakshi

జంతువులను పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. కొందరు శునకాల్ని, మరి కొందరు మార్జాలాలను, ఇంకొందరు పక్షులను.. ఇలా రకరకాల ప్రాణులను తమ ఇండ్లలో పెంచుకుంటారు. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. వాటి కోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధ పడతారు. ప్రపంచంలోనే ఖరీదైన కొన్ని పెంపుడు జంతువులను ఇక్కడ చూద్దాం..
– ఏపీ సెంట్రల్‌ డెస్క్‌

గ్రీన్‌ మంకీ – థ్రోగ్‌బ్రెడ్‌ రేస్‌ హార్స్‌.. రూ.117 కోట్లు
అత్యంత ఖరీదైన పెంపుడు జంతువుగా అమెరికాకు చెందిన మగ రేసు గుర్రం గ్రీన్‌ మంకీ నిలుస్తుంది. తొలి రేసులోనే అత్యంత వేగంగా పరుగుపెట్టి ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక మైలు దూరాన్ని కేవలం 10 సెకండ్లలోనే అధిగమించింది. కాబట్టి దీనికి అంత రేటు. దీని వీర్యం కూడా ఖరీదైనది కావడంతో ఈక్వెస్ట్రియన్‌ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. అందువల్ల దీనిని పోటీ పడి కొన్నారు. 

సర్‌ లాన్స్‌లాట్‌ ఎన్‌కోర్‌ – లాబ్రడార్‌..117 కోట్లు
లాబ్రడార్‌ శునకానికి అంత ఖరీదు ఎందుకు అనిపించవచ్చు. అయితే ఇదొక అద్భుతమైన కుక్క. అందుకే దీనికి అంత రేటు. ఏంటా అద్భుతం అంటే.. ఇది పూర్తిగా క్లోనింగ్‌ ప్రక్రియ ద్వారా ప్రపంచంలోనే విజయవంతంగా జన్మించిన శునకం. అందువల్లే దీనికి అంత రేటు అన్నమాట. 

మిస్‌ మిసీ – ఆవు రూ. 8.82 కోట్లు
ఆవు ఇంత ఖరీదా... అని మనం నోరెళ్లబెట్టవచ్చు. అయినా.. ఈ హోలిస్టీన్‌ ఆవు ప్రత్యేకతలు అలాంటివి మరి. ఆవుల పోటీల్లో పలు అవార్డులు పొందడంతో దీనికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అంతేగాక సాధారణ ఆవుల కంటే కనీసం 50 శాతం ఎక్కువగా పాలిస్తుంది.

రెడ్‌ ప్యూర్‌ బ్రీడ్‌ టిబెటిన్‌ మాస్టిఫ్‌... 4.28 కోట్లు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జాతి శునకం ఇది. ఈ జాతి అత్యంత అరుదైనది కావడంతోనే దీనికి ఆ రేటు. ముందు నుంచి చూస్తే అచ్చం సింహం ఆకారంలో ఉంటుంది. మనుషులతో స్నేహ పూర్వకంగా మెలుగుతాయి. ఇప్పుడు వీటిని ఇతర శునకాలతో క్రాస్‌ బ్రీడ్‌ చేస్తున్నారు. ఒరిజినల్‌ బ్రీడ్‌ మాత్రం అత్యంత ఖరీదైనదే.

తెల్ల సింహం కూన రూ. 1.03 కోట్లు
ఈ తెల్ల సింహం పిల్లలను చూస్తే భలే ముద్దొస్తున్నాయి కదా! వీటిని పెంచుకుందామని అనుకుంటే మాత్రం చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్క కూనను విడిగా అమ్మరు కాబట్టి.. రెండు కూనలను కొన్నాల్సి వస్తుంది. అంటే రూ. 2.06 కోట్లు పెట్టాల్సిందే. సింహాల్లో అత్యంత అరుదైన రంగు కాబట్టి వీటికి ఆ రేటు. కొన్ని దేశాల్లో వీటిని పెంచుకోవడానికి అనుమతి ఉంది. 

అరేబియన్‌ గుర్రం రూ. 70 లక్షలు
గుర్రాల్లో అరేబియన్‌ జాతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా పురాతనమైన జాతిగా దీనికి పేరుంది. సుదీర్ఘమైన ప్రయాణాలకు, ఈక్వెస్ట్రియన్‌ క్రీడలకు అనువైనవి. మనుషులతో ఎంతో ప్రేమగా, అప్యాయతగా ఉంటాయి. కొంచెం ఖర్చు ఎక్కువైనా.. మంచి పెట్టుబడిగా దీనిని పెంచుకునే వాళ్లు భావిస్తారు. 

చింపాంజీ రూ. 44.14 లక్షలు
మనుషుల తర్వాత తెలివైన జీవులుగా చింపాంజీలకు పేరుంది. ఈ తెలివైన జీవులు మనుషులకు బాగా మచ్చిక అవుతాయి. యజమానులతో ఆటలు ఆడతాయి. నవ్విస్తాయి. కవ్విస్తాయి. వీటిలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఒకటి బొనోబో, రెండోది సాధారణ చింపాజీ. చాలా దేశాల్లో వీటిని పెంచుకోవడానికి అనుమతి ఉంది. అయితే వీటి రోజు వారీ ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. 

లావెండర్‌ అల్బినో బాల్‌ పైథాన్‌ రూ. 30 లక్షలు
పామును పెంచుకోవడం అంటే అయ్యబాబాయ్‌ అంటాం. అలాంటిది ఓ కొండచిలువ (పైథాన్‌)ను పెంచుకోవడమా.. అని అనిపిస్తుంది. కొంతమందికి పాముల్ని పెంచడం కూడా ఓ హాబీ. లావెండర్‌ అల్బినో బాల్‌ పైథాన్‌ ఆఫ్రికా ఖండానికి చెందిన చిన్న సైజు కొండచిలువ. ఈ కొండచిలువ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అందుకే పెంచుకుంటారు.

సవానా పిల్లి రూ. 15 లక్షలు
సాధారణ పెంపుడు పిల్లికి, ఆఫ్రికా సెర్వల్‌ జాతి పిల్లికి పుట్టినది ఈ పిల్లి. సాధారణ పెంపుడు పిల్లి కన్నా కొంచెం ఎత్తుగా, నాజూగ్గా ఉంటుంది. మనుషులతో చాలా స్నేహపూర్వకంగా మెలుగుతాయి. సరదాగా ఉంటాయి. ఇతర పిల్లుల్లా కాకుండా నీటిలో ఆడుకోవడం అంటే వీటికి భలే సరదా. ఎవరూ తోడు లేకపోయినా స్వతంత్రంగా ఆడుకోవడం ఈ పెంపుడు పిల్లులకు అలవాటు. గుర్రాల్లో అరేబియన్‌ జాతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా పురాతనమైన జాతిగా దీనికి పేరుంది. సుదీర్ఘమైన ప్రయాణాలకు, ఈక్వెస్ట్రియన్‌ క్రీడలకు అనువైనవి. మనుషులతో ఎంతో ప్రేమగా, అప్యాయతగా ఉంటాయి. కొంచెం ఖర్చు ఎక్కువైనా.. మంచి పెట్టుబడిగా దీనిని పెంచుకునే వాళ్లు భావిస్తారు. 

హ్యాసింత్‌ మకావ్‌ రూ. 10 లక్షలు
రామచిలుక జాతుల్లో ఇదో పెద్ద జాతి. నీలం రంగుతో భలే చూడ ముచ్చటగా ఉంటుంది. దీనిని కొనడమే కాదు.. పెంచడం కూడా ఖర్చుతో కూడుకున్నదే. ఈ తెలివైన పక్షులకు మంచి నాణ్యమైన ఆహారం అందించాల్సి ఉంటుంది. దీనికి సౌకర్యవంతమైన గూడు ఏర్పాటు చేయాలి. ఖర్చును తట్టుకుంటే ఇదో మంచి పెంపుడు పక్షిలా ఉంటుంది. సులువుగా దీనికి తర్ఫీదు ఇవ్వవచ్చు. యజమానులతో చాలా ప్రేమగా ఉంటుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top