ఢిల్లీలో ఊపిరి ఆడట్లేదు

Supreme Court On Delhi Air Pollution Says Wear Masks Even At Home - Sakshi

వాయుకాలుష్యం కట్టడికి అత్యవసర చర్యలు తీసుకోండి

కేంద్ర రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని, అత్యవసర పరిస్థితి కింద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తే మంచిదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం సూచించింది. ఇళ్లల్లో కూడా మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు వచ్చాయని జస్టిస్‌ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్ని తీయడంతో పిల్లలు ఎక్కువగా కాలుష్యం బారిన పడుతున్నారని ప్రధాన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం పెరిగిపోవడానికి పంట వ్యర్థాలను కాల్చడమే కారణమని కేవలం రైతుల్ని మాత్రమే నిందించడం తగదన్నారు. వాహనాల నుంచి కాలుష్యం, బాణాసంచా కాల్చడం, పారిశ్రామిక వ్యర్థాలు వంటివన్నీ కూడా వాయుకాలుష్యాన్ని తీవ్రతరం చేస్తున్నాయని అన్నారు.

ఏక్యూఐని 500 పాయింట్ల నుంచి 200కి తగ్గించడానికి ఏం చెయ్యాలో ఆలోచించాలి.. రెండు రోజుల లాక్‌డౌన్‌ సహా అత్యవసరంగా చర్యలేమైనా తీసుకోండి..అని ధర్మాసనం పేర్కొంది. గాలిలో కాలుష్యాన్ని తగ్గించి శుద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన స్మాగ్‌ టవర్లు చేస్తున్నాయా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన అడ్వకేట్‌ రాహుల్‌ మెహ్రా.. సెప్టెంబర్‌ 30న ఏక్యూఐ 84 ఉంటే ప్రస్తుతం 474కి పెరిగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం కాలుష్యం రోజుకి 20 సిగరెట్లు కాల్చిన దానితో సమానమని అన్నారు.  కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం 6.30కి ఏక్యూఐ 427గా ఉంది.
(చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ!)

వారం రోజులు పాఠశాలలు బంద్‌
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  ఢిల్లీలో బడుల్ని సోమవారం నుంచి వారం రోజులు మూసివేయనున్నట్లు్ల సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ సమయంలో స్కూళ్లు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తారని  చెప్పారు. ప్రైవేటు కార్యాలయాలు కూడా ఉద్యోగులందరికీ వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వాలని సూచించారు. నిర్మాణ రంగం పనుల్ని నవంబర్‌ 14 నుంచి 17వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
(చదవండి: వావ్‌ ఏంటీ అద్భుతం... ఆకాశంలో హ్యారీపాటర్‌ సినిమాలో మాదిరి ఎగురుతోంది!!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top