 
													2 వేల మందిని చంపేసిన ఆర్‌ఎస్‌ఎఫ్
ఎల్–ఫషెర్ నుచి వేలాది మంది పలాయనం
ఖార్టుమ్: సూడాన్‌లోని ఉత్తర దార్ఫుర్ ప్రాంతంలో ఉన్న ఎల్–ఫషేర్ నగరంలో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్‌ఎస్‌ఎఫ్) మూకలు రక్తపు టేరులు పారిస్తున్నాయి. నగరంలోకి ఆదివారం ప్రవేశించిన ఈ బలగాలు వేలాది మంది పౌరులను నిర్బంధంలోకి తీసుకున్నాయి. వారిలో కనీసం 1,500 మందిని చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నగరంలోని సౌదీ ఆస్పత్రిని దిగ్బంధించి, మరో 460 మందిని బలి తీసుకున్నట్లు సమాచారం.
భయకంపితులైన జనం ప్రాణాలరచేత బట్టుకుని పలాయనమవుతున్నారు. వారిని కూడా ఆర్‌ఎస్‌ఎఫ్ మూకలు వదలడం లేదు. చిత్రహింసల పాల్జేజి, చంపేస్తున్నారు. ఎలాగోలా తప్పించుకుని కాలి నడకన కనీసం 36 వేల మంది జనం అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలోని టవిలా పట్టణానికి చేరుకున్నట్లు సమాచారం. 48 గంటల వ్యవధిలోనే 15 వేల మంది నగరం వీడినట్లు అంచనా.
ఇప్పటికే అక్కడ గూడుకోల్పోయిన వారు 6.50 లక్షలమంది ఉన్నట్లు అంచనా. ఖననం చేసే వారు లేకపోవడంతో ఎల్–ఫషెర్ నగరంలో ఎక్కడ చూసినా మృతదేహాలే పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అక్కడ భయానక వాతావరణం నెలకొందన్నారు. కట్టుబట్టలతోనైనా తాము బయట పడటం అదృష్టమని చెప్పారు. 
ఆర్‌ఎస్‌ఎఫ్ సామూహిక జననానికి పాల్పడుతోందని సూడాన్ ఆర్మీ ఆరోపిస్తోంది. ఎల్–ఫòషేర్‌లో నరకానికి మించిన దారుణ పరిస్థితులున్నాయని ఐరాస మానవీయ విభాగం చీఫ్ టామ్ ఫ్లెచర్ వ్యాఖ్యానించారు. ఎల్–ఫòషేర్ నగరాన్ని ఏడాదిన్నర కాలంగా ఆర్‌ఎస్‌ఎఫ్ దిగ్బంధించింది. ఆహారం, ఇతర అత్యవసరాలు అందకుండా చేసింది. సూడాన్ ఆర్మీ నగరం నుంచి ఉపసంహరించుకోవడంతో రెచ్చిపోతోంది.  
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
