ఎవరు ఎప్పుడు ఎందుకు కొట్టుకు చస్తున్నారో ఎవరికీ తెలియడంలేదు..! మతం కోసం మంటలు పెడుతు, ఆధిపత్యం కోసం హత్యలు చేస్తూ..కొందరి స్వార్థం కోసం అమాయకులు బలైపోతున్న ఈ ప్రపంచంలో సూడాన్ అనే దేశం కూడా ఒకటి. అవును..! సూడాన్ అనే పేరు వింటేనే రక్తపు వాసన వస్తుంది. అక్కడ ప్రతి రోజూ మరణాలే రాజ్యమేలుతున్నాయ్..! ఆకాశం మీదుగా కాల్చిన తుపాకీ గుండ్లు వినిపిస్తుంటే..ఒక తల్లి తన బిడ్డను ఎక్కడ దాచిపెట్టాలో తెలియని దయనీయ దుస్థితితో తల్లడిల్లిపోతోంది.
నిత్యం హత్యలు, దోపిడీలతో సూడాన్ అల్లకల్లోలంగా మారింది. రోజూ వందలాది మందిని కొన్ని ముఠాలు కాల్చిచంపుతుంటే.. కోట్లాది మందికి ఆహారం దొరక్క ఆకలితో విలవిలలాడుతున్నారు. ఇంతకీ సూడాన్‌లో ఎందుకిలా జరుగుతోంది? మనుషులు ఇంత దారుణంగా ఎందుకు మారుతున్నారు? ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఇంత ఘోరం జరుగుతుంటే ప్రపంచం ఎందుకు మౌనం పాటిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఓసారి ష్లాష్‌బ్యాక్‌కు వెళ్లాలి.. గతంలోకి తొంగిచూడాలి.
సూడాన్‌లో ఈ రోజు కనిపిస్తున్న విధ్వంసం ఒక్కరోజులో ఏర్పడినది కాదు. దీని మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. ఒకప్పుడు ఆఫ్రికాలోని విభిన్న తెగలు, భాషలు, మతాలు, సంస్కృతులు కలసి జీవించిన నేల సూడాన్. కానీ ఈ భూమి మీద ఎన్నో శక్తులు తమ ఆధిపత్యం కోసం పోరాడాయి. మొదటగా 1820లో ఈజిప్టు, ఒట్టోమాన్ సైన్యాలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించాయి. తర్వాత బ్రిటిష్ పాలకులు వచ్చి ఈ భూమిని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. కానీ తెల్లదొరలు పెట్టిన పాలనా వ్యవస్థ, వారి ఆర్థిక విధానం ఉత్తర సూడాన్, దక్షిణ సూడాన్ మధ్య ఉన్న భిన్నతలను మరింత పెంచింది. ఉత్తర భాగంలో ఇస్లామిక్ ప్రభావం ఎక్కువైంది. ఇటు దక్షిణ భాగంలో క్రైస్తవ, స్థానిక మతాలు బలంగా ఉన్నాయి. ఈ విభేదాలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొనసాగాయి.
1955లో సూడాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నా, ఆ స్వేచ్ఛ ప్రజల చేతుల్లో కాకుండా కొంతమంది అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. వారంతా తమ రాజకీయ శక్తిని నిలుపుకోవడానికి మతాన్ని ఆయుధంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇస్లాం చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేయడం ఆనాడే ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో దక్షిణ సూడాన్ ప్రజల మతపరమైన హక్కులు నశించాయి. తిరుగుబాట్లు మొదలయ్యాయి. 1969లో గాఫర్ అల్ నిమైరీ అనే సైనిక అధికారి తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చాడు. అయితే అతను కూడా ప్రజలను హింసించేందుకే నిర్ణయించుకున్నాడు. దేవుడిచ్చిన పాలకుడిగా తనని తాను ప్రకటించుకున్నాడు. సౌదీ అరేబియా మద్దతు పొందేందుకు షరియా చట్టాలను అమలు చేశాడు. బహిరంగ శిక్షలు, చేతులు-కాళ్లు నరికే అమానుష చర్యలు, రాళ్లతో కొట్టి చంపడం లాంటి విధానాలు ప్రభుత్వంలో భాగమయ్యాయి. ఆర్థికంగా దేశం కూలిపోయింది. చివరికి ఆయన పాలన ప్రజల తిరుగుబాటుతో ముగిసింది కానీ నాలుగేళ్లలోనే మరో తిరుగుబాటు జరిగింది.
1989లో ఒమర్ అల్ బషీర్ అనే సైనిక అధికారి తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఆయన సూడాన్ చరిత్రలో అతి క్రూర పాలకుడిగా నిలిచాడు. బషీర్ పూర్తిగా ఇస్లామిక్ దేశాన్ని స్థాపించాడు. చేతులు, కాళ్లు నరికే శిక్షలను కోర్టులే విధించడం మొదలుపెట్టాయి. మహిళలు ప్యాంటు వేసుకున్నా తప్పుగా ప్రకటించారు. అలా ప్యాంట్ ధరించిన వారిని కొరడాతో కొట్టారు. బషీర్ పాలనలో అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ సూడాన్‌లో ఆశ్రయం పొందాడు. సూడాన్ భూమిని ఉగ్రవాదానికి కేంద్రంగా మార్చాడు. దీనిపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. 1998లో సూడాన్‌లో బాంబులు వేసింది. అదే సమయంలో దార్ఫూర్ ప్రాంతంలో రక్తపాతం ప్రారంభమైంది. పలు ఇస్లామిక్ దళాలు, జంజావీద్ ఫోర్సస్ కలిసి బషీర్ ప్రభుత్వ మద్దతుతో నల్ల ఆఫ్రికన్ తెగలపై దాడులు చేశాయి. ఊర్లకు ఊర్లను దహనం చేశాయి. ఇందులో వేలాది మంది చనిపోగా.. లక్షలాది మంది శరణార్థులయ్యారు.
2013లో ఆ జంజావీద్ దళాలనే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్-RSF అని పిలిచే కొత్త సైనిక విభాగంగా మార్చారు. దీనికి నాయకత్వం వహించిన వాడే హెమెడీ. ఇతను దార్ఫూర్ నుంచి వచ్చిన వ్యక్తి. ఇక 2019లో ప్రజల తిరుగుబాటుతో బషీర్ పదవి కోల్పోయాడు. కానీ మారింది కేవలం ముఖాలు మాత్రమే. 2021లో హెమెడీ, సైనిక అధికారి బుర్హాన్‌తో కలిసి మరో తిరుగుబాటు చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందనే ఆశ మళ్లీ నశించింది. ఈ ఇద్దరి మధ్య పవర్ కోసం పోరు ప్రారంభమై 2023లో అది పౌరయుద్ధంగా మారింది. ఒకవైపు సూడాన్ ఆర్మీ ఫోర్సెస్, మరోవైపు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్. ఇలా ఈ రెండు గ్రూపుల మధ్య యుద్ధం దార్ఫూర్ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసింది.
ప్రత్యేకంగా అల్ ఫషీర్ నగరంలో జరిగిన ఘటనలు ప్రపంచాన్ని కలచివేశాయి. 2025 అక్టోబర్‌లో RSF దళాలు ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత 2,500 మందికిపైగా పౌరులను చంపేశాయి. గర్భిణీలు ఉన్న ఆస్పత్రులను కూడా వదల్లేదు. శరణార్థి శిబిరాలను తగలబెట్టారు. జమ్జమ్ శిబిరంలో వేలాది మంది చనిపోయారు. నాలుగు లక్షల మంది ప్రాణ భయంతో ఇతర ప్రాంతాలకు పారిపోయారు. ప్రస్తుతం సూడాన్‌లో కోటి 40లక్షలకుపైగా శరణార్థులు ఉన్నారు. 2 కోట్ల 50లక్షల మంది ఆకలితో బాధపడుతున్నారు. ఇలా నగరాలు శూన్యంగా మారిన వేళ.. పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. అయితే ఈ పరిస్థితిని చూడగలిగే శక్తి ప్రపంచానికి లేకపోవడం అత్యంత బాధాకరం.
మరో దురదృష్టకరం ఏంటంటే ఈ యుద్ధం వెనుక విదేశీ శక్తులు కూడా ఉన్నాయి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కి UAE ఆయుధాలను, డబ్బును అందిస్తోంది. సౌదీ అరేబియా, ఖతర్ ఏమో సూడాన్ ఆర్మీకి మద్దతు ఇస్తున్నాయి. ఈ విధంగా సూడాన్ నేల అంతర్జాతీయ రాజకీయాల యుద్ధరంగంగా మారింది. ఐక్యరాజ్యసమితితో పాటు ఇతర దేశాలు ఈ పరిస్థితని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నా ఎవ్వరూ తమ మిత్రులను వదలడానికి సిద్ధంగా లేరు. దీని కారణంగా సూడాన్ రెండు భాగాలుగా విభజనకు గురవుతున్న దేశంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే మతాల కోసం, వర్గాల కోసం మరో దేశం బలైపోతుందనే చేదు నిజాన్ని సూడాన్ మళ్లీ మన కళ్లకు కట్టింది..!


