
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై పన్నులు విధిస్తూ ఎంజాయ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. సుంకాల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తే.. ఇప్పటి వరకు వచ్చిన బిలియన్ డాలర్ల ఆదాయం రీఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వెల్లడిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తాజాగా మీట్ ది ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల విషయమై సుప్రీంకోర్టులో తీర్పు రావాల్సి ఉంది. కోర్టు తీర్పును ట్రంప్‌కు అనుకూలంగా వస్తే మంచిదే. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం.. మేము దాదాపు సగం సుంకాలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది అమెరికా ట్రెజరీకి భయంకరంగా మారుతుంది. తిరిగి చెల్లింపులను జారీ చేయడానికి పరిపాలన సిద్ధంగా ఉందా లేదా? అనేది తేలాలి. అదే జరిగితే పలు దేశాల నుంచి ముక్కు పిండి వసూలు చేసిందంతా అమెరికా కక్కాల్సి ఉంటుంది. అయితే, సుప్రీంకోర్టులో ట్రంప్ అనుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక, 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద ట్రంప్‌కు భారీ సుంకాలను విధించే అధికారం లేదని రెండు ఫెడరల్ కోర్టులు తేల్చిన తర్వాత బెసెంట్ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. ప్రపంచ దేశాలపై పన్నులు విధించేందుకు బ్రేకులు పడుతుండటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫెడరల్ చట్టం ప్రకారం అధ్యక్షుడికి దిగుమతులపై సుంకాలు విధించే హక్కు ఉందని పేర్కొంటూ ఈ కేసును అత్యవసరంగా విచారణ జరపాలని కోరింది. ఎమర్జెన్సీ అధికార చట్టం ప్రకారం ట్రంప్ సుంకాలు విధించారని ఇటీవల అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆ సుంకాలు చట్టవిరుద్ధమని పేర్కొనడంతో ట్రంప్ యంత్రాంగం సుప్రీం తలుపుతట్టింది.
నవంబర్ ప్రారంభంలోనే ఈ కేసుపై వాదనలు వినాలని సొలిసిటర్ జనరల్ డి.జాన్ సావర్ న్యాయమూర్తిని కోరారు. ‘అప్పీల్స్ కోర్టు నిర్ణయం అధ్యక్షుడు ఐదు నెలలుగా విదేశాలతో కొనసాగిస్తున్న చర్చలను అనిశ్చితిలోకి నెడుతుంది. ఇప్పటికే పూర్తయిన చర్చలను, జరగబోయే చర్చలను ప్రమాదంలో పడేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వాదనను లిబర్టీ జస్టిస్ సెంటర్ వ్యాజ్య డైరెక్టర్, సీనియర్ న్యాయవాది జెఫ్రీ ష్వాబ్ తోసిపుచ్చారు. ‘చట్టవిరుద్ధమైన సుంకాలు చిన్న వ్యాపారాలకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి. వాటి మనుగడ ప్రమాదంలో పడుతోంది. ఈ కేసులో మా క్లయింట్లకు సత్వరం పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై వ్యాపార వర్గాలు ఇప్పటికే రెండు న్యాయస్థానాల్లో పైచేయి సాధించాయి.