సౌదీ హజ్‌ యాత్రికులకు అలర్ట్: పేమెంట్‌ గడువులో మార్పు | Saudi Arabia cuts Hajj payment window to six hours before deadline | Sakshi
Sakshi News home page

సౌదీ హజ్‌ యాత్రికులకు అలర్ట్: పేమెంట్‌ గడువులో మార్పు

May 12 2026 4:02 AM | Updated on May 12 2026 4:06 AM

Saudi Arabia cuts Hajj payment window to six hours before deadline

దుబాయ్‌: పవిత్ర హజ్‌ యాత్రకు సిద్ధమవుతున్న స్వదేశీ యాత్రికులకు సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. హజ్‌, ఉమ్రా మంత్రిత్వ శాఖ మే 15 (శుక్రవారం) నుంచి దేశీయ హజ్‌ బుకింగ్‌ చెల్లింపుల రెండో దశను ప్రారంభించనుంది. అయితే, ఈ దఫా సీట్ల లభ్యతను పెంచేందుకు చెల్లింపుల గడువు విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది.

గడువు 72 గంటల నుంచి 6 గంటలకు..
ప్రస్తుతం ప్రాథమిక రిజర్వేషన్ పొందిన వారికి ఇన్వాయిస్ చెల్లించడానికి 72 గంటల సమయం ఇస్తుండగా, మే 15 నుంచి ఈ విధానంలో మార్పులు రానున్నాయి. మే 15 నుంచి రిజర్వేషన్ పొందిన వారు కేవలం 6 గంటలలోపే చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరైనా బుక్ చేసుకుని చెల్లింపులు చేయకపోతే, ఆ సీటు బ్లాక్ అవ్వకుండా వెంటనే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఇతర దరఖాస్తుదారులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత గడువు (6 గంటలు) ముగిసిన వెంటనే చెల్లించని రిజర్వేషన్లు సాఫ్ట్‌వేర్ ద్వారా స్వయంచాలకంగా రద్దవుతాయి.

సదాద్‌ ద్వారానే చెల్లింపులు
ఇప్పటికే 'నుసుక్' (Nusuk) ప్లాట్‌ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న సౌదీ పౌరులు, నివాసితులు 'సదాద్' (SADAD) డిజిటల్ సిస్టమ్ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. యాత్రికుల సౌకర్యార్థం మినాలో 24,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో కొత్త గుర్తింపు కలిగిన గుడారాలను ఏర్పాటు చేస్తున్నారు. హజ్‌ 2026 సీజన్ కోసం చేపడుతున్న ఈ ఆధునికీకరణ పనుల వల్ల యాత్రికులకు మెరుగైన వసతులు లభించనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement