బైడెన్‌ బృందంలో మరో భారతీయురాలు

Sabrina singh appointed as Deputy Press Secretary - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష స్థానాన్ని అధిరోహించనున్న జో బైడెన్‌ తన టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తన బృందంలో భారత సంతతికి చెందిన వారికి పెద్దపీట వేస్తున్న బైడెన్‌ ఇప్పుడు మరొకరికి కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. శ్వేత భవనంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌కు డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా 32 ఏళ్ల భారత సంతతికి చెందిన సబ్రినా సింగ్‌ను నియమించారు.

ఎన్నికల సమయంలో బైడెన్‌, కమలా హ్యారీస్‌కు మీడియా కార్యదర్శిగా సబ్రినా సింగ్‌ పని చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అంతకుముందు అమెరికాలో డెమొక్రటిక్‌ నేషనల్‌ కమిటీలో కమ్యూనికేషన్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. గతంలో సబ్రినా మైక్ బ్లూంబర్గ్ అధ్యక్ష ప్రచార సీనియర్ ప్రతినిధిగా, కోరీ బుకర్ అధ్యక్ష ప్రచారానికి నేషనల్‌ ప్రెస్ సెక్రెటరీగా పని చేసింది. అమెరికన్ బ్రిడ్జ్ ట్రంప్ వార్ రూమ్ ప్రతినిధి, హిల్లరీ క్లింటన్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రాంతీయ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గానూ సేవలందించారు. ఆమె ఎస్‌కేడీకే నికర్ బాకర్ కన్సల్టింగ్‌ సంస్థ, రిపబ్లిక్ జాన్ షాకోవ్స్కీకి కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా, వివిధ డెమొక్రాటిక్ కమిటీల్లోనూ పని చేశారు.

ఎంతో గౌరవం: సబ్రినా సింగ్‌
డిప్యూటీ ప్రెస్‌ కార్యదర్శిగా నియమితులవడంపై సబ్రినా సింగ్‌ సంతోషం వ్యక్తం చేసింది. వైట్‌హౌస్‌ బృదంలో చేరడం ఎంతో గొప్ప విషయమని, గౌరవంగా భావిస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కమలా హ్యారీస్‌కు పని చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top