‘తూర్పు’పై రష్యా పట్టు 

Russia agrees to evacuate civilians from Azot plant - Sakshi

క్లిష్టంగా పరిస్థితి: జెలెన్‌స్కీ 

అజోట్‌ ప్లాంటు నుంచి పౌరుల తరలింపుకు రష్యా అంగీకారం

కీవ్‌:  తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా క్రమంగా పట్టు సాధిస్తోంది. అక్కడ 80 శాతం ఇప్పటికే రష్యా చేతిలోకి వెళ్లిపోయింది. అక్కడి డొనెట్స్‌క్‌ ప్రాంతంలో కీలక నగరమైన సెవెరోడొనెట్స్‌క్‌ను కూడా రష్యా సేనలు దాదాపుగా ఆక్రమించుకున్నాయి. భారీ ఆయుధాలతో అవి పెను విధ్వంసం సృష్టిస్తుండటంతో ఉక్రెయిన్‌ సేనలు శివారు ప్రాంతాలకు పరిమితమయ్యాయి.

ఈ నేపథ్యంలో మిగిలిన పౌరులను వీలైనంత త్వరగా తరలించేందుకు ఉక్రెయిన్‌ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. లక్ష మంది జనాభాలో వలసల అనంతరం 12 వేల మంది దాకా ఇంకా నగరంలో ఉన్నట్టు అంచనా. వారికి న్యితావసరాలతో పాటు అన్నిరకాల సరఫరాలకూ దారులు పూర్తిగా మూసుకుపోయాయి.

దాదాపు 800 మంది దాకా ఆశ్రయం పొందుతున్న అజోట్‌ కెమికల్‌ ప్లాంటుపై రష్యా పెద్దపెట్టున బాంబు దాడులు చేస్తోందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. ప్లాంటులో నుంచి పౌరులు సురక్షితంగా వెళ్లిపోయేందుకు వీలుగా బుధవారం మానవీయ కారిడార్‌ తెరుస్తామని రష్యా సైనికాధికారి కల్నల్‌ జనరల్‌ మిఖాయిల్‌ మిజినెత్సేవ్‌ ప్రకటించారు.

ఉక్రెయిన్‌ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పరిస్థితి క్లిష్టంగా ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించారు. కానీ తమ దళాలు శక్తిమేరకు పోరాడుతున్నాయన్నారు.

రష్యాది క్రూరత్వం: పోప్‌ 
రష్యాపై పోప్‌ ఫ్రాన్సిస్‌ తొలిసారిగా తీవ్ర పదజాలం ప్రయోగించారు. ఉక్రెయిన్‌లో రష్యా దళాలు చెప్పలేనంత క్రూరత్వానికి, అకృత్యాలకు పాల్పడుతున్నాయంటూ మండిపడ్డారు.

ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశ రక్షణలో ఉక్రెయిన్‌ పౌరులు చూపుతున్న ధైర్యసాహసాలు, హీరోయిజం అద్భుతమని ప్రశంసించారు. తూర్పున విస్తరించేందుకు నాటో చేసిన ప్రయత్నాలే రష్యాను యుద్ధానికి పురిగొల్పాయని అభిప్రాయపడటం విశేషం. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top