
17 ఏళ్లప్పుడు రైలులో కెమిల్లా అనుభవం
తాజా పుస్తకంలో వెల్లడించిన బ్రిటన్ రాణి
లండన్: లండన్‌లో రైలులో వెళ్తుండగా తనపై జరిగిన లైంగిక దాడిని ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నదీ బ్రిటన్ రాణి కెమిల్లా తాజాగా విడుదలైన పుస్తకంలో వెల్లడించారు. రాజకుటుంబం, ప్రధాని కార్యాలయం మధ్య సంబంధాలను తెలిపే ‘పవర్ అండ్‌ది ప్యాలెస్’పేరుతో విడుదలైన ఈ పుస్తకంలో కింగ్ చార్లెస్–3 భార్య కెమిల్లా, అప్పటి లండన్ మేయర్ బోరిస్ జాన్సన్ మధ్య సంభాషణ గురించిన వివరాలున్నాయి. ‘అప్పుడు నా 16, 17 ఏళ్లుంటాయి.
లండన్ రైలులో వెళ్తుండగా ప్యాడింగ్‌టన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి అనుచితంగా తాకేందుకు యతి్నంచాడు. అంతే, నా షూ తీసి అతడి గజ్జల్లో కొట్టా. ట్రెయిన్ ఆగాక రైల్వే పోలీసుకు అతడిని అప్పగించా. అమ్మ నాకు చెప్పినట్లే చేశా’అని కెమిల్లా వివరించారు. 2008లో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో లండన్ మేయర్‌గా ఉన్న బోరిస్ జాన్సన్ దృష్టికి తీసుకెళ్లడం, ఆయన ఇటువంటి ఘటనల విషయంలో యంత్రాంగం తక్షణమే స్పందించేలా లండన్ వ్యాప్తంగా మూడు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిపోయాయి. ఒక కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో కెమిల్లా సైతం పాల్గొన్నారు. ఈ పుస్తకంలో పేర్కొన్న అంశాలపై బకింగ్ హమ్ ప్యాలెస్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కెమిల్లా బాధ్యతాయుతమైన పని చేశారని పుస్తక రచయిత్రి అన్నారు.