Russia-Ukraine Crisis: Putin Orders Russian Forces To Ukraine Rebel Regions - Sakshi
Sakshi News home page

Ukraine-Russia Standoff: యుద్ధం ముంగిట యూరప్‌.. ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యం  

Feb 23 2022 2:18 AM | Updated on Feb 23 2022 2:15 PM

Putin Orders Russian Forces To Ukraine Rebel Regions - Sakshi

Russia-Ukraine crisis news: ఇన్నాళ్ల భయాలు నిజమవుతున్నాయి. యూరప్‌ యుద్ధం ముంగిట నిలిచింది. ఉక్రెయిన్‌పై రష్యా దూకుడు క్రమంగా ప్రత్యక్ష సైనిక ఆక్రమణగా మారుతోంది. ఉక్రెయిన్‌లో రెబెల్స్‌ అధీనంలోని రెండు ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు ప్రకటించిన రష్యా, మంగళవారం వాటిలోకి భారీగా సైన్యాన్ని నడిపి అగ్నికి మరింత ఆజ్యం పోసింది. తాము ప్రకటించిన స్వతంత్ర హోదా రెబల్స్‌ నుంచి ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలకూ వర్తిస్తుందని ప్రకటించి, రష్యా సేనలు అక్కడిదాకా చొచ్చుకెళ్తాయని చెప్పకనే చెప్పింది. ఈ పరిణామాలపై అమెరికా, యూరప్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు మండిపడ్డాయి.

అంతర్జాతీయ ఒప్పందాలను, మర్యాదలను రష్యా తుంగలో తొక్కిందంటూ దుయ్యబట్టాయి. ఐరాస భద్రతా మండలి రాత్రికి రాత్రి అత్యవసరంగా సమావేశమై, రష్యా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. దానిపై కఠినాతి కఠినమైన ఆంక్షలకు సిద్ధమవుతున్నట్టు అమెరికా, యూరప్‌ ప్రకటించాయి. రష్యా స్వతంత్ర హోదా ప్రకటించిన ప్రాంతాలతో వర్తక వాణిజ్యాలపై అమెరికా నిషేధం విధించింది. ఇంగ్లండ్‌ ఏకంగా ఐదు రష్యా బ్యాంకులపై ఆంక్షలు విధించింది. తమ దేశంలోని ముగ్గురు రష్యా కుబేరుల ఆస్తులను స్తంభింపజేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఆరంభం మాత్రమేనని, మున్ముందు నాటో సభ్య దేశాలతో కలిసి కనీవిని ఎరగని ఆంక్షలతో విరుచుకుపడతామని రష్యాను హెచ్చరించింది. రష్యా దూకుడును అడ్డుకునేలా ఉక్రెయిన్‌కు అన్నివిధాలా సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. మొత్తానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత తీవ్రమైన యుద్ధ సంక్షోభం యూరప్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

దేనికీ భయపడబోం: ఉక్రెయిన్‌
రష్యా ఇన్నాళ్లుగా తాను పరోక్షంగా మద్దతిస్తూ వస్తున్న ఉక్రెయిన్‌లోని డొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌ వేర్పాటువాద ప్రాంతాలను మంగళవారం నేరుగా తన అధీనంలోకి తీసుకుంది. రష్యా అనుకూల రెబెల్స్‌ అధీనంలో ఉన్న ఆ ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సోమవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) ప్రకటించారు. ఈ మేరకు డిక్రీ జారీ చేశారు. ఉక్రెయిన్‌ అధీనంలోని రెబెల్స్‌ ప్రాంతాలకు కూడా తమ ప్రకటన వర్తిస్తుందని పేర్కొన్నారు. అక్కడికి సైన్యాన్ని పంపేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రష్యా వెలుపల సైన్యాన్ని వాడేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ పార్లమెంటుకు లేఖ రాశారు! ఆ వెంటనే రష్యా సైన్యం శరవేగంగా కదిలింది.

డోన్బాస్‌గా పిలిచే ఆ రెండు ప్రాంతాల్లోకి ‘శాంతి పరిరక్షణ’ పేరిట భారీ సంఖ్యలో చొచ్చుకెళ్లి వాటిని తన అధీనంలోకి తీసుకుంది. అక్కడి నుంచి ఉక్రెయిన్‌ దిశగా ముందుకు కదులుతోంది. ఉక్రెయిన్‌కు మూడు దిక్కుల్లో ఇప్పటికే రెండు లక్షల దాకా సైన్యం మోహరించి ఉండగా, బెలారుస్‌లో 30 వేలకు పైగా రష్యా దళాలు సంయుక్త విన్యాసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఉక్రెయిన్‌ సార్వభౌమాధికారంపై దాడేనని ఉక్రెయిన్, అమెరికా, పశ్చిమ దేశాలు దుయ్యబట్టాయి. 2015 నాటి మిన్‌స్క్‌ శాంతి ఒప్పందాన్ని రష్యా తుంగలో తొక్కిందని మండిపడ్డాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ ప్రకటించారు. మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘దేనికీ భయపడబోం. మా భూభాగంలో అంగుళం కూడా వదులుకోం’ అన్నారు. దీనిపై చర్చించేందుకు ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి అమెరికా వెళ్తున్నారు. 

ఆంక్షల పర్వం 
పుతిన్‌ చర్యలను అమెరికా, ఇంగ్లండ్‌ తీవ్రంగా ఎండగట్టాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగేందుకు ఆయన చేస్తున్న మతిమాలిన ప్రయత్నాలను విఫలం చేసి తీరతామన్నాయి. ఆర్థికంగా రష్యా రెక్కలు విరిచే స్థాయిలో నేరుగా కఠినమైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి. డోన్బాస్‌తో అమెరికా వర్తక, వాణిజ్యాలను పూర్తిగా నిషేధిస్తూ అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాకు చెందిన వారెవరూ ఆ ప్రాంతాల్లో ఇకపై ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలూ జరపరాదని పేర్కొన్నారు. రష్యాపై ఆంక్షల జాబితాను త్వరలో ప్రకటిస్తామని వైట్‌హౌస్‌ పేర్కొంది. రష్యాకు చెందిన రొసియా, ఐఎస్‌బ్యాంక్, జనరల్‌బ్యాంక్, ప్రొమ్స్‌వియాజ్‌ బ్యాంకులపై ఆంక్షలు విధిస్తున్నట్టు ఇంగ్లండ్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా ప్రకటించారు. ఇంగ్లండ్‌లోని రష్యా కుబేరులు గెనడీ టిమ్‌చెంకో, బోరిస్‌ రోటెన్‌బర్గ్, ఇగోర్‌ రోటెన్‌బర్గ్‌ల ఆస్తులన్నింటినీ స్తంభింపజేస్తున్నట్టు పేర్కొన్నారు. రష్యాపై విధించాల్సిన ఆంక్షల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు యూరోపియన్‌ యూనియన్‌ కూడా ప్రకటించింది. అంతకుముందు పుతిన్‌ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, దాని మిత్ర పక్షాలే కారణమంటూ నిప్పులు చెరిగారు. ఉక్రెయిన్‌ ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనంటూ తన ఉద్దేశాలను వెల్లడించారు. 

చర్చలతోనే పరిష్కారం

భద్రతా మండలిలో భారత్‌
ఐరాస:
ఉక్రెయిన్‌ సంక్షోభంపై భారత్‌ ఆందోళన వెలిబుచ్చింది. ఉద్రిక్తత నివారణే తక్షణ కర్తవ్యమని అభిప్రాయపడింది. అందుకు చర్చలే ఉత్తమ పరిష్కార మార్గమని సూచించింది. పుతిన్‌ ప్రకటన వెలువడగానే ఉక్రెయిన్, అమెరికా తదితర దేశాల విజ్ఞప్తి మేరకు సోమవారం రాత్రి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్‌.తిరుమూర్తి అన్నారు. ఉక్రెయిన్‌ పరిణామాలను భారత్‌ నిశితంగా గమనిస్తోందని చెప్పారు.

రష్యా చర్యలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. తూర్పు ఉక్రెయిన్‌లోని ఈ సమస్యను మిన్‌స్క్‌ ఒప్పందానికి లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యాకు సూచించారు. తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌ చేసే అన్ని ప్రయత్నాలకూ ఐరాస పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. బలప్రయోగం ద్వారా ఏమైనా చేయొచ్చని పుతిన్‌ భావిస్తున్నారని, తన దుందుడుకు చర్యల ద్వారా అంతర్జాతీయ వ్యవస్థలనే సవాలు చేస్తున్నారని ఐరాసలో అమెరికా ప్రతినిధి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ విమర్శించారు. ఆయనకు గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ, డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా తదితర దేశాలన్నీ రష్యా చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి. 15 దేశాలతో కూడిన భద్రతా మండలి ఉక్రెయిన్‌ సంక్షోభంపై భేటీ కావడం ఇటీవలి కాలంలో ఇది మూడోసారి. ఇటీవలి కాలంలో రష్యాకు దగ్గరవుతున్న చైనా మాత్రం, సంక్షోభ నివారణకు మరిన్ని చర్చలు మేలంటూ ఆచితూచి స్పందించింది. 

విద్యార్థులూ, వచ్చేయండి 
సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులంతా తక్షణం వెనక్కు వచ్చేయాలని కేంద్రం మరోసారి సూచించింది. అక్కడి భారత వైద్య విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసుల సదుపాయం కల్పించేలా ఉక్రెయిన్‌ మెడికల్‌ వర్సిటీలతో మాట్లాడుతున్నట్టు తెలిపింది. అక్కడి దౌత్య సిబ్బంది కుటుంబీకులు కూడా తక్షణం దేశం వీడాలని ఇప్పటికే కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement