మలాలాపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోషియేషన్‌

Private Schools Association Launches Anti Malala Documentary In Pakistan - Sakshi

ఇస్లామాబాద్: నోబెల్‌ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్‌ జాయ్‌పై పాకిస్తాన్‌లోని ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోషియేషన్‌ విద్యార్థులకు విషం నూరిపోస్తోంది. ఇందుకోసం ఆ సంఘం ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం సోమవారం విద్యా కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌ను లక్ష్యంగా చేసుకుని యువతలో ఆమె పట్ల వ్యతిరేకత కలగడానికి ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. మతం, పెళ్లి, పశ్చిమ దేశాల అజెండా అమలు విషయంలో ఆమె తీరును దీనిలో ప్రస్తావించారు. కాగా, మలాలా సోమవారం 24వ పుట్టిన  రోజు జరుపుకొన్నారు.

ఇక సోమవారం పాకిస్థాన్‌లోని గుల్‌బెర్గ్‌లోని కార్యాలయంలో ఆల్‌ పాకిస్తాన్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫెడరేషన్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.  దీని అధ్యక్షుడు కసీఫ్‌ మిర్జా మాట్లాడుతూ ‘‘ ఐ యామ్‌ నాట్‌ మలాలా  డాక్యుమెంటరీ  చిత్రంలో.. ఆమెకు మతం, పెళ్లిపై ఉన్న వివాదాస్పద అభిప్రాయాలు, పశ్చిమ దేశాల అజెండా అమలు వంటి అంశాలను వెల్లడించారు. యువతలో ఆమె అసలు రూపాన్ని బహిర్గతం చేయడమే మా లక్ష్యం. మహిళల హక్కుల కోసం పోరాడుతుందనుకొని యువత ఆమె పట్ల ఆకర్షితులు కాకుండా చేయడమే మా ఉద్దేశం. మా దేశంలోని 2,00,000 ప్రైవేట్ పాఠశాలల్లోని 20 మిలియన్ల విద్యార్థులకు దీనిని చూపిస్తాం’’ అని పేర్కొన్నారు.

మలాలా పెళ్లిని వ్యతిరేకిస్తోంది
మలాలా పెళ్లిని వ్యతిరేకిస్తూ సహజీవనాన్ని సమర్థిస్తోందని కసీఫ్‌ మిర్జా ఆరోపించారు. దేశంలోని వివాహ వ్యవస్థపై ఆమె దాడి చేస్తోందని పేర్కొన్నారు. మలాలా రాసిన ‘ఐ యామ్‌ మలాలా’ పుస్తకంలోని పలు అంశాలను ఆయన తప్పుపట్టారు. పాక్‌ పాఠశాలల్లో మతపరమైన విద్యను బోధించడం, అలీ జిన్నా గురించి చెప్పడంపై ఆమె వ్యతిరేకత వ్యక్తం చేశారన్నారు. ఈ పుస్తకాన్ని పశ్చిమ దేశాల అజెండా అమలు కోసం రాసినట్లు ఉందన్నారు. ఇక "మలాలా తండ్రి జియావుద్దీన్ ఒక టీవీ కార్యక్రమంలో తన బ్లాగును బీబీసీ కరస్పాండెంట్ అబ్దుల్ హై కాకర్ రాశారని, 'ఐ యామ్ మలాలా' పుస్తకం క్రిస్టినా లాంబ్ రాసినట్లు ఒప్పుకున్నారు." అని ఆయన అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top