బ్రేక్​ఫాస్ట్ కోసం బిల్లులు.. పోలీసుల దర్యాప్తు

Police Probe On Finland PM Sanna Marin Breakfast Bill  - Sakshi

హెల్సింకి: అధికారంలోకి రాగానే అనేక సంస్కరణలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఫిన్లాండ్​ ప్రధాని సన్నా మారిన్​ చిక్కుల్లో పడింది. ఫ్యామిలీ బ్రేక్​ఫాస్ట్ కోసం ఆమె నెలకు 300 యూరోల అధికారిక సొమ్ము ఖర్చు చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఫిన్లాండ్​ ప్రధాని సన్నా మారిన్​.. కెసరంటాలోని అధికారిక నివాసంలో కుటుంబంతో సహా ఉంటోంది. అయితే బ్రేక్​ఫాస్ట్ కోసం నెలకు 300 యూరోలు(365 డాలర్లు) ఖర్చు అవుతున్నట్లు చూపిస్తూ.. ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచి ఆమె క్లెయిమ్​ చేస్తోంది. ఈ మేరకు లోకల్ టాబ్లాయిడ్​ ఒకటి కథనం ప్రచురించడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో సన్నా మారిన్ స్పందించారు. ఒక ప్రధానిగా తాను ఎలాంటి సౌకర్యాలు కోరుకోలేదని, అలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆమె ట్వీట్​ చేశారు.

కాగా, రీఎంబర్స్​మెంట్​ గురించి చట్టంలో ఎక్కడా లేదన్న పోలీసులు.. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం ఆరోపణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిన్నిష్​ చట్టాలకు విరుద్ధంగా సన్నా వ్యవహరించారని, ఆమె ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. కాగా, పోలీస్​ విచారణను సన్నా స్వాగతించారు. కాగా, 35 ఏళ్ల సన్నా మారిన్​ డిసెంబర్​ 2019లో ఫిన్లాండ్​కు ప్రధాని అయ్యింది. పాలనతో పాటు కరోనా కట్టడిలో మిగతా యూరోపియన్​ దేశాల నుంచి శెభాష్​ అనిపించుకుందామె. కానీ, తర్వాతి నుంచి ఆమె క్రేజ్​ పడిపోతూ వస్తోంది. ఈ మేరకు జూన్ 13న జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష రైట్​ వింగ్ పార్టీ ఘన విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top