మెల్‌బోర్న్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా పర్యటన పూర్తిచేసుకున్న ప్రధాని మోదీ బుధవారం ఆ్రస్టేలియాకు చేరుకున్నారు. ఇప్పుడే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టానని పేర్కొంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఈ పర్యటన భారత్–ఆ్రస్టేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ఉత్తేజాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఆ్రస్టేలియా నేతలతో జరపబోయే చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో మోదీకి ఆ్రస్టేలియా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బానీస్‌తో మోదీ సమావేశం కాబోతున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై వారు చర్చిస్తారు. అలాగే ప్రవాస భారతీయులను సైతం మోదీ కలుసుకుంటారు. అల్బానీస్‌తో కలిసి 3వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. కీలకర రంగాల్లో భారత్–ఆ్రస్టేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సంప్రదింపులు జరుపుతారు.
మెల్‌బోర్న్‌లోని హోటల్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. వందేమాతరం, మోదీ–మోదీ అని నినదించారు. ఈ సందర్భంగా కళాకారులు తమ ప్రదర్శనతో ఆలరించారు. మెల్‌బోర్న్‌లో వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ భారతీయుల ఆతీ్మయ స్వాగతం మాత్రం నిజంగా చిరస్మరణీయమని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వారి అనురాగం, భారతదేశంతో వారికి ఉన్న దృఢమైన అనుబంధం ఎప్పటికీ ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తూనే ఉంటాయని స్పష్టంచేశారు.


