ఫిలిప్పీన్స్‌ ఉపాధ్యక్షురాలికి బిగ్‌ షాక్‌ | Philippine Vice President Impeached Over Suspected | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్‌ ఉపాధ్యక్షురాలికి బిగ్‌ షాక్‌

May 12 2026 7:26 AM | Updated on May 12 2026 7:26 AM

Philippine Vice President Impeached Over Suspected

మనీలా: ఫిలిప్పీన్స్‌ ఉపాధ్యక్షురాలు సారా డ్యుటెర్టె ఉద్వాసనకు గురయ్యారు. ప్రతినిధుల సభ సోమవారం ఆమెను పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో ఆమోదించింది. బయటికి వెల్లడించని ఆస్తులను కూడబెట్టారని, అధ్యక్షుడిని చంపుతామంటూ బెదిరిస్తున్నారని మాజీ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె కుమార్తె అయిన సారాపై ఆరోపణలున్నాయి.

అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌తో విభేదాలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రతినిధుల సభ 255–26 ఓట్ల భారీ తేడాతో సారా డ్యుటెర్టెను తొలగిస్తూ తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై సెనేట్‌లో విచారణ జరగనుంది. 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న సారాకు ఇది పెద్ద షాక్‌ అని పరిశీలకులు అంటున్నారు.

గతేడాది కూడా ప్రతినిధుల సభ సారా ఉద్వాసన తీర్మానం చేసింది. అయితే, సుప్రీంకోర్టు ఆ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించడంతో గండం గట్టెక్కారు. అయితే, తనపై వస్తున్న ఆరోపణలను సారా డ్యటెర్టె ఖండిస్తున్నారు. అధ్యక్షుడు మార్కోస్‌ కుటుంబీకులు అవినీతిలో కూరుకుపోయారని విమర్శిస్తున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్‌కు పోటీగా మారరాదనే తనపై ఇలాంటి చర్యలకు పూనుకున్నారని ఆరోపిస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement