
న్యూఢిల్లీ: పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి జరిపిన కొద్దిరోజులకే ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇరుపక్షాలలో ఎవరిపైన దాడి జరిగినా.. అది ఇద్దరిపైన జరిగిన దాడిగానే గుర్తిస్తారు. అప్పుడు ఇరు పక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడుతాయి.
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్- పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ రక్షణ ఒప్పందంపై సంతకం చేశాక, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. యువరాజు ఆహ్వానం మేరకు పాక్ ప్రదాని షరీఫ్ సౌదీ అరేబియాకు వెళ్లారని పాక్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడం, ఏదైనా దురాక్రమణ ఎదురైనప్పుడు దానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది’ అని సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఒక దేశంపై ఏదైనా దాడి జరిగితే అది ఇరు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించాయి. ఇది జరిగిన తరువాత సౌదీ-పాక్‌ల మధ్య ఈ తరహా ఒప్పందం కుదరడం గమనార్హం. మరోవైపు ఖతార్- యునైటెడ్ స్టేట్స్ మెరుగైన రక్షణ సహకార ఒప్పందాన్ని ఖరారు చేసే దశలో ఉన్నాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు.