పాక్‌ మునీర్‌ నోటి దురుసు.. భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు | Pakistan Asim Munir Over Action Comments On India | Sakshi
Sakshi News home page

పాక్‌ మునీర్‌ నోటి దురుసు.. భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు

May 11 2026 9:10 AM | Updated on May 11 2026 10:51 AM

Pakistan Asim Munir Over Action Comments On India

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌.. మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్‌ మునీర్‌ ఓవరాక్షన్‌ కామెంట్స్‌ చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌తో జరిగిన పోరాటం సాధారణ యుద్ధం కాదని, అది రెండు సిద్ధాంతాల మధ్య జరిగిన యుద్ధమని పేర్కొన్నారు. భారత్‌పై మరోసారి పలు ఆరోపణలు చేశారు.

ఆసిమ్‌ మునీర్‌ రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో సైనికాధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా మునీర్‌.. ఆపరేషన్‌ సిందూర్‌ ప్రస్తావన తెచ్చారు. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్.. పాకిస్తాన్‌ భౌగోళిక సమగ్రతను ఉల్లంఘించిందని ఆరోపించారు. దీనికి పాకిస్థాన్ జాతీయ ఐక్యతతో, పూర్తి సైనిక శక్తితో సమాధానం ఇచ్చిందన్నారు. మార్కా-ఎ-హక్ కేవలం రెండు దేశాల మధ్య జరిగిన సంప్రదాయ యుద్ధం కాదని, అది రెండు భిన్న సిద్ధాంతాల మధ్య జరిగిన నిర్ణాయక పోరాటమని వ్యాఖ్యానించారు. ఘర్షణ సమయంలో పాకిస్తాన్‌ 26 లక్ష్యాలపై దాడులు నిర్వహించిందని మునీర్ తెలిపారు.

అయితే ఆ దాడులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. అలాగే యుద్ధ విరమణ కోసం అమెరికా ద్వారా భారత్ ముందుకొచ్చిందని కూడా ఆరోపించారు. శాంతి ప్రయోజనాల దృష్ట్యా పాకిస్తాన్‌ కాల్పుల విరమణకు అంగీకరించిందని అన్నారు.  భవిష్యత్ యుద్ధాల స్వరూపం పూర్తిగా మారబోతుంది. భూమి, గగనం, సముద్రం, సైబర్, అంతరిక్ష రంగాలను కలుపుకుని మల్టీ డొమైన్ వార్‌ఫేర్ రూపంలో యుద్ధాలు సాగుతాయని చెప్పారు. అందుకే పాక్‌ సైన్యం సాంకేతికత, ఆధునిక ఆయుధాలు, శిక్షణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పాకిస్థాన్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, హంగోర్ క్లాస్ జలాంతర్గాములు, కొత్త రాకెట్ ఫోర్స్, ఆధునిక యుద్ధవిమానాల కొనుగోళ్ల ద్వారా సైనిక సామర్థ్యాన్ని పెంచుతున్నామని మునీర్ తెలిపారు.

మరోవైపు భారత్ మాత్రం ఆ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తోంది. కాల్పుల విరమణపై ఎలాంటి మూడో దేశం జోక్యం లేదని, రెండు దేశాల సైనికాధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చల ద్వారానే అవగాహన కుదిరిందని భారత ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తన హక్కును వినియోగించుకుందని, సరిహద్దు దాటి జరిగే ఉగ్రచర్యలను ఇక సహించబోమని కూడా భారత్ పునరుద్ఘాటిస్తోంది. ఇక, భారత్‌ కూడా.. ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా ఉగ్రవాదంపై తన వైఖరిని ఇటీవల మరోసారి స్పష్టం చేసింది. పాక్‌ మద్దతుతో జరుగుతున్న సరిహద్దు ఉగ్ర చర్యలకు తగిన సమాధానం ఇస్తామని, అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని భారత్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement