భారత్‌ సహా ఆ 3 దేశాల పిలుపుపై ఉ.కొరియా ఘాటు వ్యాఖ్యలు | North Korea Rejects Denuclearisation Push By Quad Nations | Sakshi
Sakshi News home page

భారత్‌ సహా ఆ 3 దేశాల పిలుపుపై ఉ.కొరియా ఘాటు వ్యాఖ్యలు

May 28 2026 8:18 PM | Updated on May 28 2026 8:44 PM

North Korea Rejects Denuclearisation Push By Quad Nations

ప్యాంగ్యాంగ్: క్వాడ్ దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనను ఉత్తర కొరియా గురువారం ఖండించింది. సంపూర్ణ అణు నిరాయుధీకరణ చేపట్టాలని క్వాడ్‌ దేశాలు ఆ ప్రకటనలో కోరగా తమ అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఎప్పటికీ విడిచిపెట్టబోమని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్హాప్ ఈ విషయాన్ని వెల్లడించింది.

భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ‘క్వాడ్’ కూటమి ఇటీవల సమావేశం జరిపిన విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా, జపాన్  విదేశాంగ మంత్రులు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో కలిసి ఇటీవల న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఉత్తర కొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణపై తమ వైఖరిని మరోసారి ప్రకటించారు.

దీనికి ప్రతిస్పందనగా ఉత్తర కొరియా విదేశాంగ శాఖ.. క్వాడ్ ప్యాంగ్యాంగ్ సార్వభౌమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. అలాగే, ఈ తీరు “అమెరికా ఏకపక్ష ఆధిపత్య లక్ష్యాల సాధనకు ఉపయోగపడే రాజకీయ, దౌత్య సాధనం మాత్రమే” అని విమర్శించింది.

“డీపీఆర్‌కే(డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా) అణు నిరాయుధీకరణ ఎప్పటికీ చేయదని మేము మరోసారి చెబుతున్నాం” అని ఆ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికా నేతృత్వంలోని క్వాడ్ తమ దేశంపై తీసుకున్న వైఖరిని పూర్తిగా తిరస్కరిస్తున్నామని ఉత్తరకొరియా తెలిపింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ఘర్షణాత్మక చర్యలను నిలిపివేయాలని క్వాడ్‌ కూటమిని గట్టిగా కోరింది.

విధ్వంసకర ఆయుధాలు వద్దు 
మంగళవారం విడుదలైన క్వాడ్ విదేశాంగ మంత్రుల సంయుక్త ప్రకటనలో... “సంబంధిత యూఎన్‌ఎస్‌సీఆర్‌లకు అనుగుణంగా ఉత్తర కొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణపై మా వైఖరిని మళ్లీ తెలియజేస్తున్నాం. సంబంధిత యూఎన్‌ఎస్‌సీఆర్‌ల కింద ఉన్న అన్ని బాధ్యతలను ఉత్తర కొరియా పాటించాలని కోరుతున్నాం” అని పేర్కొన్నారు. యూఎన్‌ఎస్‌సీఆర్‌ అంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు.

“ఉత్తర కొరియా అక్రమ బాలిస్టిక్ క్షిపణులు, విధ్వంసకర ఆయుధాల అభివృద్ధిని మేము ఖండిస్తున్నాం. ఉత్తర కొరియా సైబర్ కార్యకలాపాలు, ఐటీ కార్మిక చర్యలపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఇవి ఉత్తర కొరియా అక్రమ సామూహిక విధ్వంస ఆయుధాలు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తున్నాయి. 

ఉత్తర కొరియాకు సంబంధించిన యూఎన్‌ఎస్‌సీఆర్‌ల ఉల్లంఘనలను ఎదుర్కొనే చర్యలకు మద్దతు కొనసాగిస్తాం. ఉత్తర కొరియాకు ఆయుధాలు, సంబంధిత సామగ్రి బదిలీ చేయడం లేదా అక్కడి నుంచి కొనుగోలు చేయడంపై ఉన్న నిషేధం సహా, యూఎన్‌ఎస్‌సీఆర్‌ల కింద ఉన్న అంతర్జాతీయ బాధ్యతలను అన్ని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు అమలు చేయాలి” అని క్వాడ్‌ దేశాల విదేశాంగ మంతత్రులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement