స్క్విడ్‌ గేమ్‌ చూశాడని తుపాకులతో కాల్చి చంపి, ఆపై విద్యార్థులను..

North Korea Kim Execute Man Over Netflix Squid Game Copies Supply - Sakshi

ఎవరు ఎలా పోయినా సరే.. దేశ కఠిన చట్టాలను తన పౌరులు గౌరవించాలన్నది ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఉద్దేశం. అదే దాయాది దక్షిణ కొరియా విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే కర్కశంగా వ్యవహరిస్తుంటాడు. తాజాగా అలాంటి పరిణామమే ఒకటి జరగ్గా.. దుశ్చర్యకు పాల్పడ్డాడు కిమ్‌. 

దక్షిణ కొరియా నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ‘స్క్విడ్‌ గేమ్‌’ను చూశాడనే నెపంతో  ఓ వ్యక్తికి మరణశిక్ష విధించాడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ఆ వెంటనే శిక్షను అమలు చేస్తూ ఆ వ్యక్తిని కిరాతకంగా కాల్చి చంపింది సైన్యం. చైనా సర్వర్ల నుంచి సిరీస్‌ను డౌన్‌లోడ్‌ చేసి వీక్షించాడని, అంతటితో ఆగకుండా ఫ్లాష్‌ పెన్‌డ్రైవ్‌లలో కొందరు విద్యార్థులకు కాపీలను అమ్ముకున్నాడని ప్రభుత్వం ఆరోపించింది.

ఇక ఈ వ్యవహారంలో ఓ విద్యార్థికి జీవిత ఖైదు విధించారు. సిరీస్‌ చూసిన మరో ఆరుగురికి, సదరు స్కూల్‌ ప్రిన్స్‌పాల్‌, టీచర్లను విధుల నుంచి తొలగించి ఐదేళ్ల నిర్భంద శిక్ష విధించాడు కిమ్‌. నార్త్‌ కొరియా చట్టాల ప్రకారం.. వీళ్లంతా బొగ్గు గనుల్లో, మారుమూల పల్లెల్లో శిక్షాకాలం పాటు కూలీ పనులు చేయాల్సి ఉంటుంది. ‘‘స్క్విడ్‌ గేమ్‌ అనేది వినోదం పంచేది కాదు. పెట్టుబడిదారి అయిన దక్షిణ కొరియా క్రూరత్వాన్ని ప్రతిబింబించే షో. డబ్బు కోసం మనిషి ఉవ్విళ్లూరడం, ప్రాణాల్ని పణంగా పెట్టడం.. ఉత్తర కొరియా సంప్రదాయానికి విరుద్ధమైన అంశాలు. అందుకే మొగ్గలోనే ఈ వ్యవహారాన్ని తుంచేస్తున్నాం’’ అంటూ ప్రభుత్వం తరపు నుంచి ఓ స్టేట్‌మెంట్‌ స్థానికంగా ఓ పత్రికలోనూ ప్రచురితమైంది. 

ఉత్తర  కొరియాలో క్యాపిటలిస్ట్‌ దేశాల ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాల్ని వీక్షించినా, వాటి కాపీలు కలిగి ఉన్నా, ఇతరులకు పంపిణీ చేసినా నార్త్‌ కొరియాలో కఠిన శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుంది.  ఈ లిస్ట్‌లో అమెరికా, దక్షిణ కొరియాను ప్రముఖంగా చేర్చింది కిమ్‌ ప్రభుత్వం.  అలా చేస్తే తమ దేశ గౌరవాన్ని దిగజార్చినట్లు, కల్చర్‌ను కించపరిచినట్లు భావిస్తుంది అక్కడి ప్రభుత్వం.

చదవండి: కిమ్‌ కొత్త ఎత్తు! కల్చరల్‌ వార్‌ ఎందుకంటే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top