అక్కడ యుద్ధానికి బ్రేక్‌.. ఇక్కడ కిమ్‌ బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలు | North Korea Fires Suspected Ballistic Missile, Japan Issues Alert | Sakshi
Sakshi News home page

అక్కడ యుద్ధానికి బ్రేక్‌.. ఇక్కడ కిమ్‌ బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలు

Apr 8 2026 1:56 PM | Updated on Apr 9 2026 12:37 PM

 North Korea Fires Suspected Ballistic Missile, Japan Issues Alert

సియోల్: ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా బ్రేక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడ గొడవ తగ్గుతుందనుకుంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తమ ప్రాంతం నుంచి కలకలం రేపారు. ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు చేసింది. ఆ వెంటనే జపాన్ హెచ్చరిక జారీ చేసింది. జపాన్ ప్రధాన మంత్రి సనయె తకైచి కార్యాలయం కూడా ఈ విషయంపై ఎక్స్‌లో పోస్టు చేసింది. “ఉత్తర కొరియా అనుమానిత బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసింది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి” అని తకైచి కార్యాలయం తెలిపింది.

ఈ ప్రయోగం తర్వాత జపాన్ అధికారులు పౌరుల భద్రతపై సూచనలు జారీ చేశారు. “ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేయడంతో ప్రధాన మంత్రి చేసే సూచనలను పాటించాలి. ప్రజలకు అధికారులు సమయానుకూలంగా సరైన సమాచారం అందించాలి. విమానాలు, నౌకలు, ఇతర ఆస్తుల భద్రతపై దృష్టి పెట్టాలి. అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండటం సహా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి” అని అధికారిక ప్రకటనలో తెలిపారు.

కొరియాలో ఉద్రిక‍్తతలు తగ్గుతున్నాయన్న సూచనలు అన్నీ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చేయించిన ఈ చర్యతో పటాపంచలయ్యాయి. దక్షిణ కొరియా సంయుక్త చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జెసిఎస్) తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కొరియా వోన్సాన్ ప్రాంతం నుంచి తూర్పు తీర సముద్ర దిశగా ఉత్తరకొరియా బుధవారం (ఏప్రిల్‌ 8న) క్షిపణిని ప్రయోగించింది.

ఇదే రోజు ఉదయం కూడా అదే ప్రాంతం సమీపం నుంచి పలు గుర్తించని స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఆ క్షిపణులు సుమారు 240 కి.మీ (150 మైళ్లు) ప్రయాణించాయి. దక్షిణ కొరియా, అమెరికా అధికారులు దీనిపై విశ్లేషణ చేస్తున్నారు. దక్షిణ కొరియా అధ్యక్ష భవనం బ్లూ హౌస్ అత్యవసర జాతీయ భద్రతా మండలి సమావేశాన‍్ని నిర్వహించింది. ఉత్తరకొరియా ఇలాంటి పరీక్షలను ఆపాలని దక్షిణ కొరియా కోరింది. జపాన్ తీర రక్షక దళం తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం తర్వాత సుమారు 10 నిమిషాల్లో సముద్రంలో పడింది. జపాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాంటి క్షిపణులు తమ భౌగోళిక జలాల్లోకి ప్రవేశించలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement