మా టీకా 94.5% ప్రభావవంతం

Moderna covid-19 vaccine found 94.5per cent effective at preventing coronavirus - Sakshi

మోడెర్నా సంస్థ ప్రకటన  

న్యూయార్క్‌: తాము అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్‌ టీకా 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరీక్షల్లో తేలిందని అమెరికాలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ సంస్థ మోడెర్నా సోమవారం ప్రకటించింది. కరోనాను అంతం చేసే విషయంలో తాము ఉమ్మడిగా అభివృద్ధి చేస్తున్న టీకా 90 శాతానికి పైగానే ప్రభావం చూపుతున్నట్లు ఫైజర్, బయోఎన్‌టెక్‌ సంస్థలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మోడెర్నా సంస్థ ఎంఆర్‌ఎన్‌ఏ–1273 పేరిట కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది.

ఇది 94.5 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆధ్వర్యంలోని డేటా సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డు మూడోదశ పరీక్షల్లో వెల్లడైందని మోడెర్నా తాజాగా పేర్కొంది. వ్యాక్సిన్‌ను తీసుకొచ్చే విషయంలో ఇదొక కీలకమైన ముందడుగు అని వెల్లడించింది. తమ టీకా వినియోగానికి వీలుగా యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం నుంచి ఎమర్జెన్సీ హెల్త్‌ ఆథరైజేషన్‌(ఈయూఏ) దరఖాస్తు చేసుకోవాలని మోడెర్నా భావిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ వినియోగం కోసం అనుమతులు తీసుకోవాలని నిర్ణయించింది.

మూడో దశ ప్రయోగాల్లో ‘కోవాగ్జిన్‌’..
హైదరాబాద్‌: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ‘కోవాగ్జిన్‌’ మూడో దశ ప్రయోగాల్లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ఆ సంస్థ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా సోమవారం తెలియజేశారు. ఆయన సోమవారం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నిర్వహించిన వర్చువల్‌ సదస్సులో మాట్లాడారు.

ముక్కు ద్వారా చుక్కల రూపంలో అందించే మరో కరోనా వ్యాక్సిన్‌ను సైతం తాము అభివృద్ధి చేస్తున్నామని, ఇది వచ్చే ఏడాది కల్లా సిద్ధమవుతుందని తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)తో కలిసి అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాల్లోకి అడుగుపెట్టిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా బయోసేఫ్టీ లెవల్‌3 (బీఎస్‌ఎల్‌3) ఉత్పత్తి సదుపాయం ఉన్న ఏకైక సంస్థ భారత్‌ బయోటెక్‌ అని గుర్తుచేశారు. కోవాగ్జిన్‌ ఫేజ్‌–1, ఫేజ్‌–2 ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు భారత్‌ బయోటెక్‌ గత నెలలో వెల్లడించింది.  

ఫేజ్‌ 1/2 దశల్లో బీఈ సంస్థ వ్యాక్సిన్‌  
బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌(బీఈ) సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఫేజ్‌ 1/2 క్లినికల్‌ ట్రయల్స్‌లోకి ప్రవేశించింది. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి విషయంలో చురుగ్గా పనిచేస్తోంది. ఈ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి లభించింది.

టీకా పంపిణీ సవాలే
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 నిరోధానికి అభివృద్ధి చేస్తున్న టీకాలు అందుబాటులోకి వచ్చినా దేశంలోని 135 కోట్ల మందికి వాటిని పంపిణీ చేయడం పెను సవాలేనని శీతలీకరణ వ్యవస్థల నిపుణుడు, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోల్డ్‌ చెయిన్‌ డెవలప్‌మెంట్‌ సీఈవో పవనేశ్‌ కోహ్లీ తెలిపారు.  దేశం మొత్తమ్మీద 28 వేల టీకా కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్ల నెట్‌వర్క్‌ అందుబాటులో ఉండగా వీటన్నింటిలోనూ –25 డిగ్రీ సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న టీకాలను నిల్వ చేసుకునే సౌకర్యం లేదన్నారు.  ఈ సమస్యను ఎదో ఒకలా పరిష్కరించగలిగినా వాటిని స్థానిక మెడికల్‌ షాపులు, ఇతర దుకాణాల్లోనూ అందుబాటులో ఉంచడం మరో సవాలని పవనేశ్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top