
కీవ్: ఉక్రెయిన్ తాజాగా రష్యా సైనిక వైమానిక స్థావరాలపై భీకర డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ మెగా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Ukrainian President Zelensky) సమర్థించుకున్నారు. ఇది అద్భుతమైన ఆపరేషన్‌గా అభివర్ణించిన ఆయన.. రష్యాకు భారీ స్థాయిలో నష్టం కలిగించిందని, ఆ దేశానికి తగిన శాస్తేనని ప్రకటించారు.
Today, a brilliant operation was carried out — on enemy territory, targeting only military objectives, specifically the equipment used to strike Ukraine. Russia suffered significant losses — entirely justified and deserved.
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 1, 2025
‘స్పైడర్స్ వెబ్’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఉక్రెయిన్ మొత్తం 117 డ్రోన్‌లను ఉపయోగించిందని, దీనికి తగిన సంఖ్యలో డ్రోన్ ఆపరేటర్లు పాల్గొన్నారని జెలెన్స్కీ చెప్పారు. వారు రష్యా వైమానిక స్థావరాలలో ఉంచిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను ఢీకొట్టేలా చేశారని పేర్కొన్నారు. తమ సిబ్బంది ఈ దాడులు చేసేందుకు ఏడాది పాటు ప్రణాళిక వేశారని, అది ఇప్పుడు ఇది సంపూర్ణంగా అమలయ్యిందని, ఇది పూర్తిగా ప్రత్యేకమైన ఆపరేషన్(Special operation) అని గట్టినమ్మకంతో చెబుతున్నానని జెలెన్‌స్కీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
ఈ దాడితో రష్యన్లు 40 యూనిట్లకు పైగా వ్యూహాత్మక వైమానిక స్థావరాలను కోల్పోవడం తనకు సంతృప్తికరంగా అనిపించిందని, తాము ఇటువంటి దాడులను ఇకముందు కూడా కొనసాగిస్తామని జెలెన్‌స్కీ తెలిపారు. ఈ దాడిలో కీవ్ సహాయం అందించిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఆయన తెలిపారు. తాము దాడి చేయడానికి కొద్దిసేపటి ముందు, తమకు రష్యా మరో దాడికి సిద్ధమవుతోందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ప్రజలను అన్ని విధాలుగా రక్షించుకుంటామని అన్నారు. తాము ఈ యుద్ధాన్ని కోరుకోలేదని, యుద్ధాన్ని కొనసాగించాలని ఎంచుకున్నది రష్యన్లే అని జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇస్తాంబుల్‌లో మాస్కో- కైవ్ మధ్య జరగనున్న శాంతి చర్చలకు ఒక రోజు ముందు ఉక్రెయిన్ ఈ దాడులకు దిగడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి లో ప్రారంభమైంది. ఇరు దేశాలు పరస్పరం సరిహద్దు షెల్లింగ్, డ్రోన్ దాడులు, రహస్య దాడులు చేసుకుంటున్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన సూచించారు.
ఇది కూడా చదవండి: రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి