వేగంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులు...లాక్‌డౌన్‌ దిశగా అడుగులు

Locked Down the Sanya Chinas Hawaii Trapping 80000 Tourists - Sakshi

Covid outbreak Tropical Sanya, ‘China’s Hawaii’: చైనాలో మళ్లీ కరోనా మహమ్మారీ రాకాసిలా విరుచుకుపడుతుంది. గత కొన్ని రోజులుగా కరోనా తగ్గుముఖం పట్టిందని ఆనందంగా ఊపిరి పీల్చుకునేలోపు మళ్లీ పగపట్టినట్టుగా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ మేరకు చైనా దక్షిణ తీరంలోని హైనాన్‌ ప్రావిన్స్‌ రాజధాని సాన్యాలో అధిక సంఖ్యలో కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. అదీగాక సాన్యా పర్యాటక హాట్‌స్పాట్‌గా ప్రసిద్ధి. దీంతో ప్రస్తుతం అక్కడ సుమారు 80 వేల మంది దాక పర్యాటకులు ఉన్నారు.

ఐతే వేగంగా విజృంభిస్తున్న ఈ కరోనా కేసుల దృష్ట్యా అధికారులు బహిరంగ ప్రదేశాల్లో సాముహికంగా ప్రజలు తిరగడాన్ని నిషేధించారు. శనివారం ఉదయం నుంచి ప్రజల కదలికలను నియంత్రించడమే కాకుండా  రెస్టారెంట్లు, బార్‌లు, నగరంలోని ప్రసిద్ధ డ్యూటీ-ఫ్రీ మాల్స్‌తో సహా చాలా బహిరంగ వేదికలను మూసివేయమని ఆదేశించారు. అంతేగాదు ప్రసుతం నగరంలో నెలకొన్న పరిస్థితిని అర్థం చేసుకుని పర్యాటకులు తమకు సహకరించాలని కోరారు. పర్యాటకులు సాన్యా నగరాన్ని విడిచిపెట్టడం కోసం సకాలంలో కరోనా టెస్టులు చేయించుకోవడం తప్పనసరి అని చెప్పారు.

అలాగే విమానం ధరలు పెరగడంతో ప్రస్తుతం ఎంతమంది సాధ్యమైనంత తొందరగా సాన్యా నగరాన్ని వదిలి వెళ్లగలరనేది  చెప్పలేనని తెలిపారు. ప్రస్తుతం సాన్యాలో ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు దాదాపు 455 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నగరంలో మాస్ టెస్టింగ్ జరుగుతోందని, కనీసం ఆగస్ట్ 8 వరకు బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని నివాసితులకు సూచించడమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పౌరులు కూడా నగరంలోకి ప్రవేశించవద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు కట్టడి చేసే దిశగా మళ్లీ కఠిన లాక్‌ డౌన్‌ ఆంక్షలు విధించనున్నట్లు నొక్కి చెప్పారు.

(చదవండి: ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం... స్పాట్‌లో ఆహుతైన వాహనాలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top