UK PM Race: బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌కు షాక్‌.. లిజ్‌ ట్రస్‌కే జై కొడుతున్న టోరీ సభ్యులు!

Liz Truss Commanding Lead Over Rishi Sunak In UK Next Prime Minister Race - Sakshi

లండన్‌: బ్రిటన్ ప్రధాని రేసులో మొదటి ఐదు రౌండ్లలో రిషి సునాక్ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా 137 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకే మద్దతుగా నిలిచారు. దీంతో రిషి సునాక్ ప్రధాని అవ్వడం ఖాయం అని అంతా భావించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్‌ అయినట్లు బ్రిటన్‌ 'యూగోవ్' సంస్థ సర్వే చెబుతోంది. ఇది బ్రిటన్లో ప్రముఖ ఇంటర్నెట్ మార్కెట్ రీసెర్చ్‌, ఎనలిటిక్స్ సంస్థ.

కన్జర్వేటివ్ పార్టీ (టోరీ) సభ్యులు రిషి, లిజ్‌ ట్రస్‌లలో ఎవరికి మద్దతుగా ఉన్నారు అనే విషయంపై యూగోవ్ బుధ, గురువారాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 730 మంది టోరీ సభ్యులు పాల్గొనగా.. 62 శాతం మంది లిజ్‌ ట్రస్‌కే తమ ఓటు అని చెప్పారు. 38 శాతం మంది రిషి సునాక్‌కు మద్దతుగా నిలిచారు. సర్వేల్లో గతవారం వరకు రిషి సునాక్‌పై 19 శాతం పాయింట్లు లీడ్ సాధించిన ట్రస్‌ ఇప్పుడు 24శాతం పాయింట్ల లీడ్‌కు ఎగబాకడం గమనార్హం.

దీంతో కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది ఎంపీలు రిషికి మద్దతుగా నిలిచినప్పటికీ.. పార్టీ సభ్యుల్లో మాత్రం ట్రస్‌కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు ఉండటమే ఇందుకు కారణం. అంతేగాక కొద్ది రోజుల్లో సమ్మర్ క్యాంపెయిన్ ప్రారంభవుతుంది. రిషి, ట్రస్ టోరీ సభ్యులను కలిసి తమకు మద్దతు తెలపాలని జోరుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ట్రస్‌కు లభించే మద్దతు ఇంకా పెరుగుతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బ్రిటన్‌లోని బెట్టింగ్‌ రాయుళ్లు కూడా ట్రసే తమ ఫేవరెట్ అంటున్నారు.

బ్రిటన్ తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు  కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల బ్యాలెట్ ఓటింగ్ ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరగనుంది. 1.60 లక్ష మందికిపైగా ఈ ఓటింగ్‌లో పాల్గొంటారని అంచనా. మహిళలు, పురుషులతో పాటు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేసే వారిలో మెజార్టీ ఓటర్లు లిజ్‌ ట్రస్‌కే జై కొడుతున్నట్లు స్కై న్యూస్ సర్వే తెలిపింది.  

బ్రిటన్ ప్రధాని రేసులో భాగంగా జరిగిన ఐదో రౌండ్ ఓటింగ్‌లో రిషికి 137 మంది ఎంపీలు ఓటు వేయగా.. ట్రస్‌కు 113 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ టోరీ సభ్యుల విషయానికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
చదవండి: రష్యాను చావుదెబ్బ కొట్టేందుకు ఉక్రెయిన్‌కు గోల్డెన్ ఛాన్స్‌!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top