Lebanon: తీవ్ర సంక్షోభం.. అల్లాడుతున్న ప్రజలు

Lebanon: Corruption Fuelled Crisis Deepens Currency Down 90 Percent - Sakshi

బీరూట్‌: మధ్యప్రాచ్య దేశం లెబనాన్‌లో ఇంధన సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేస్తూ సరఫరాదారులు అవినీతికి పాల్పడుతున్న నేపథ్యంలో సైన్యం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం జౌక్‌ మెస్బేలోని వేర్‌హౌజ్‌లలో అక్రమంగా నిల్వ ఉంచిన 65 వేల లీటర్ల డీజిల్‌, 48 వేల లీటర్ల పెట్రోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిని స్థానిక ఆస్పత్రులు, బేకరీ నిర్వాహకులకు పంపిణీ చేశారు. కాగా పెట్రోల్‌, డీజిల్‌ దిగుమతిదారులకు ఇచ్చే సబ్సిడీని త్వరలో ఎత్తివేస్తామని సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రియాద్‌ సలామే వారాంతంలో ప్రకటించిన నేపథ్యంలో దేశంలో ఇంధన సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. అక్రమ నిల్వలు పెరిగాయి. 


ఫొటో కర్టెసీ: బీరూట్‌ టుడే

దీంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల్లో గంటల తరబడి వేచి ఉన్నా ఫలితం లేకపోవడంతో నిరసనలకు దిగుతున్నారు. ఇక అక్కర్‌లో రహస్యంగా దాచి ఉంచిన ఇంధన ట్యాంకర్‌ను కనుగొన్న ఆందోళనకారులు... 60 వేల లీటర్ల గ్యాసోలిన్‌, 40 వేల లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆర్మీ రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. మరోవైపు.. ఇంధనాన్ని పంపిణీ చేసేందుకు ఆర్మీ తీసుకువచ్చిన గ్యాసోలిన్‌ ట్యాంకర్‌ చుట్టూ పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడగా.. ఉద్రిక్త పరిస్థితి నెలకొని, ట్యాంకర్‌ పేలిపోయింది. ఈ ఘటనలో సుమారు 28 మంది మృత్యువాత పడ్డారు. 

ఓవైపు కరోనా.. మరోవైపు ఇంధన సంక్షోభం
కరెంటు కోతలు పెరగడంతో ఆస్పత్రుల్లో పేషెంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ బీరూట్‌ మెడికల్‌ సెంటర్‌లో ఇంధన కొరత, కరెంటు కోతల కారణంగా రెస్సిరేటర్లు, ఇతర పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో సుమారు 55 మంది రోగులు మరణించినట్లు సమాచారం. ఇందులో 15 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే గత రెండేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లెబనాన్‌.. ప్రస్తుతం కోవిడ్‌, ఇంధన సంక్షోభంతో పూర్తిగా డీలా పడిపోయింది. 


ఫొటో కర్టెసీ: బీరూట్‌ టుడే

ఇప్పటికే దేశంలోని సగం మంది జనాభా పేదరికంలో మగ్గిపోతున్నారు. లెబనాన్‌ కరెన్సీ విలువ 90 శాతం మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశ అధ్యక్షుడు మిచెల్‌ ఔన్‌ ఆదివారం మాట్లాడుతూ... రానున్న రెండ్రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని సంకేతాలు జారీ చేశారు. కాగా గతేడాది ఆగష్టులో బీరూట్‌లో అతిపెద్ద పేలుడు సంభవించి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగినందున ప్రధాని హసన్‌ దియాబ్‌ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నజీబ్‌ మికాటి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ.. దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతున్న నేపథ్యంలో నూతన పాలకులకు పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

చదవండి: Afghanistan: మహిళా యాంకర్‌కు తాలిబన్‌ ప్రతినిధి ఇంటర్వ్యూ!
Afghanisthan: ఏమీ వద్దు.. ప్రాణాలు మిగిలితే చాలు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top