కువైట్‌లో ప్రధాన చమురు కేంద్రంపై...  ఇరాన్‌ డ్రోన్‌ దాడులు  | Kuwait Mina al-Ahmadi refinery hit again by drones | Sakshi
Sakshi News home page

కువైట్‌లో ప్రధాన చమురు కేంద్రంపై...  ఇరాన్‌ డ్రోన్‌ దాడులు 

Apr 4 2026 4:47 AM | Updated on Apr 4 2026 6:12 AM

Kuwait Mina al-Ahmadi refinery hit again by drones

భారీగా చెలరేగిన మంటలు 

నీటిశుద్ధి కేంద్రంపైనా దాడులు 

మంటల్లో యూఏఈ రిఫైనరీ

ఇజ్రాయెల్‌తో పాటు పలు గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ భారీగా దాడులు కొనసాగించింది. కువైట్‌లో మినా అల్‌ అహ్మదీ చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్‌ దాడులకు దిగింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కువైట్‌లో ఒక నీటి శుద్ధి కేంద్రంపై కూడా డ్రోన్‌ దాడులు జరిగాయి. దానికి భారీ నష్టమే వాటిల్లినట్టు సమాచారం. బహ్రెయిన్‌లోనూ నిర్విరామంగా సైరన్లు మోతలు విన్పించాయి. పలు డ్రోన్లను అడ్డుకుని నేలకూల్చినట్టు సౌదీ అరేబియా పేర్కొంది. యూఏఈలో కూడా ఒక చమురు క్షేత్రానికి మంటలు అంటుకున్నాయి. దాంతో దాన్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

యుద్ధ నౌకపైనా దాడులు! 
అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్‌ అబ్రహంలింకన్‌ యుద్ధ నౌకపైనా భారీగా దాడులు చేసినట్టు ఇరాన్‌ ప్రకటించింది. సౌదీలోని పాటు అలీ అల్‌ సలేం డ్రోన్‌ స్థావరంపై కూడా బాంబుల వర్షం కురిపించినట్టు పేర్కొంది. అమెరికా తమ విద్యుత్కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే యూఏఈలో అమెరికాకు చెందిన కీలకమైన స్టార్‌గేట్‌ ఏఐ సెంటర్‌ను నేలమట్టం చేసేస్తామని కూడా ఇరాన్‌ హెచ్చరించింది. గల్ఫ్‌లో అమెజాన్, ఒరాకిల్‌ వంటి పలు టెక్‌ దిగ్గజ కంపెనీల కార్యాలయాలపై ఇరాన్‌ ఇప్పటికే దాడులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్‌లో రాపిడ్‌ సెంట్రీ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను మోహరిస్తున్నట్టు బ్రిటన్‌ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement