
డమాస్కస్: సిరియాలోని డ్రూజ్ కమ్యూనిటీ జనాభా అధికంగా కలిగిన స్వీడన్ ప్రావిన్స్‌లో రోజుల తరబడి కొనసాగిన మారణహోమం దరిమిలా ఇజ్రాయెల్- సిరియాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఘర్షణల్లో 300 మందికి పైగా జనం మృతిచెందారు. ఈ కాల్పుల విరమణకు ప్రాంతీయ మిత్రదేశాలు టర్కీ, జోర్డాన్ మద్దతు పలికాయి.
సిరియాలోని దక్షిణ స్వీడన్ ప్రావిన్స్‌లో రోజుల తరబడి కొనసాగిన హింస అనంతరం ఇజ్రాయెల్- సిరియాలు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇప్పటివరకూ జరిగిన ఘర్షణల్లో మహిళలు, పిల్లలు, వైద్య సిబ్బందితో సహా మొత్తం 321 మంది మరణించారని మానవ హక్కుల పరిశీలకులు తెలిపారు. సిరియా అధ్యక్ష కార్యాలయం కాల్పుల విరమణను ప్రకటించింది. ఇందుకోసం దక్షిణాన ఒక ప్రత్యేక భద్రతా దళాన్ని మోహరించినట్లు తెలిపింది. పరిస్థితులు తీవ్రతరం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా సమన్వయంతో కూడిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.
దక్షిణాన సిరియా సైనిక మోహరింపులను ఇజ్రాయెల్ వ్యతిరేకించినప్పటికీ, 48 గంటల పాటు స్వీడాకు పరిమిత సిరియన్ అంతర్గత భద్రతా దళాల ప్రవేశాన్ని అనుమతిస్తామని తెలిపింది. సిరియా కొత్త నాయకత్వం సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌లలోని డ్రూజ్ కమ్యూనిటీకి ముప్పు కలిగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్.. స్వీడాపై దాడులను కొనసాగించింది. ఇది గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని సూచిస్తుంది. స్వీడా ప్రావిన్స్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నట్లు స్థానిక వార్తా సంస్థ స్వీడా24 ప్రతినిధి ర్యాన్ మారౌఫ్ తెలిపారు.