
హమాస్ అగ్ర నేత కుమారుడు సహా ఐదుగురు మృతి
దుబాయ్: ఖతార్‌లో ఉంటున్న హమాస్ నేతలే లక్ష్యంగా మంగళవారం ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెరతీసింది. రాజధాని దోహాలోని హమాస్ రాజకీయ ప్రధాన కార్యాలయంపై దాడి జరిపింది. దాడి అనంతరం ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దాడిలో అజ్ఞాతంలో ఉన్న హమాస్ గాజా చీఫ్ ఖలిల్ అల్ హయ్యా కుమారుడు సహా తమ సభ్యులు ఐదుగురు చనిపోయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. కాల్పుల విరమణ చర్చల మధ్యవర్తులు త్రుటిలో తప్పించుకున్నారని తెలిపింది. తమ అంతరంగిక భద్రతా దళం అధికారి కూడా మృతుల్లో ఉన్నారని ఖతార్ తెలిపింది.
తామే ఈ దాడికి పాల్పడ్డామని, తమదే పూర్తి బాధ్యతని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్వయంగా ప్రకటించడం గమనార్హం. జెరూసలేంలో సోమవారం ఆరుగురిని చంపిన ఘటన నేపథ్యంలోనే ఈ దాడికి పథకం వేశామన్నారు. తమకు అందిన అదనపు నిఘా సమాచారంతో హమాస్ నేతలే లక్ష్యంగా దాడి చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. దీనిపై ముందుగా అమెరికాకు సమాచారం ఇచ్చామని ఓ అధికారి వెల్లడించారు. అమెరికా మిత్రదేశమైన ఖతార్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడితో సంక్షోభం మరింత ముదురుతుందన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు నిలిచిపోవడమే కాకుండా, బందీల విడుదల సైతం ప్రశ్నార్థకంగా మారనుంది. ఇజ్రాయెల్ చర్య అన్ని అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కడమేనని ఖతార్ పేర్కొంది. ఇజ్రాయెల్‌ది పిరికిపంద అని వ్యాఖ్యానించింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ దాడిని ఖండించారు. యూఏఈ, సౌదీ అరేబియా దాడిని తీవ్రంగా తప్పుబట్టాయి.