ఐరన్‌ డోమ్‌ మాత్రమే కాదు.. ‘ఐరన్ బీమ్ లేజర్ సిస్టమ్‌’ సైతం | Israel Reportedly Deployed Iron Dome And Iron Beam Systems To UAE Amid Iran Threats, Strengthening Defense Cooperation | Sakshi
Sakshi News home page

ఐరన్‌ డోమ్‌ మాత్రమే కాదు.. ‘ఐరన్ బీమ్ లేజర్ సిస్టమ్‌’ సైతం

May 2 2026 5:41 AM | Updated on May 2 2026 10:42 AM

 Israel deployed Iron Beam laser system in UAE

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(యూఏఈ)కు ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వ్యవస్థను పంపిందన్న విషయం ఇటీవలే బయటకు వచ్చింది. అయితే, ఇరాన్‌తో ఘర్షణ సమయంలో కేవలం ఐరన్‌ డోమ్‌ను మాత్రమే కాదు.. ఇజ్రాయెల్ తన ఐరన్ బీమ్ లేజర్ ఆధారిత గగనతల రక్షణ వ్యవస్థ వెర్షన్‌ను కూడా పంపిందని తాజాగా ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఇరాన్‌ నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్ల భారీ దాడి నుంచి యూఏఈని కాపాడడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ఈ చర్య తీసుకుంది. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య రక్షణ సహకారం ఎంతగా పెరిగిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ.

ఇజ్రాయెల్‌తో స్నేహ బంధం ఉంటే ఇలాంటి అధునాతన రక్షణ వ్యవస్థల సాయం, సాంకేతిక మద్దతు లభిస్తుందని ప్రాంతీయ అధికారి ఒకరు అన్నారు. ఇజ్రాయెల్ “స్పెక్ట్రో” అనే అధునాతన పర్యవేక్షణ వ్యవస్థను కూడా యూఏఈకు పంపింది. ఇది 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే డ్రోన్లను గుర్తించడంలో సాయపడుతోంది. యూఏఈకు ఇజ్రాయెల్‌ పంపిన దాడి, రక్షణ వ్యవస్థలు ఎక్కువగా ప్రోటోటైప్స్ కాగా, ఇవి ఇంకా ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థల్లో పూర్తిగా సమన్వయం కాలేదు.

ఐరన్ బీమ్ లేజర్ వ్యవస్థ అంటే?
ఐరన్ బీమ్ లేజర్ రక్షణ వ్యవస్థ వెర్షన్‌ తక్కువ దూర రాకెట్లు, డ్రోన్లను ఆవిరి చేసి నాశనం చేస్తుంది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా ప్రయోగించిన ప్రాజెక్టైళ్లపై ఇజ్రాయెల్ మొదట దీనిని వినియోగించింది. ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థతో పాటు కొంతమంది ఇజ్రాయెల్ సైనిక సిబ్బందిని కూడా యూఏఈకు పంపించారు.

ఇరాన్ ఇటీవల యూఏఈపై భారీగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఆయుధ వ్యవస్థలతో పాటు ఇజ్రాయెల్ స్పై సమాచారం కూడా పంచుకుంది. ఇరాన్‌లో తక్కువ దూర క్షిపణుల ప్రయోగ సన్నాహాలపై ముందస్తు సమాచారం ఇచ్చింది.

యూఏఈ అనేక స్థాయుల గగనతల రక్షణ వ్యవస్థలను వినియోగించింది. ఇరాన్‌ నుంచి ఎదురైన దాడులను వాటి ద్వారా ఎదుర్కొంది. ఇజ్రాయెల్ అభివృద్ధి దశలో ఉన్న లేదా ఇంకా రాడార్ నెట్‌వర్క్‌తో పూర్తిగా సమకాలీకరించని ఆయుధాలను కూడా యూఏఈకు పంపింది. గతంలో అబ్రహాం ఒప్పందాల ద్వారా యూఏఈ సహా నాలుగు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సత్సంబంధాలు ఏర్పడ్డాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement