హిజాబ్‌ నిరసనలపై అధ్యక్షుడి ‘రెడ్‌ లైన్‌’.. కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక

Iran President Draws The Red Line On Anti Hijab Protests - Sakshi

టెహ్రాన్‌: ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు రోజు రోజుకూ ఉధృతంగా మారుతున్నాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు కదంతొక్కటంతో దేశం మొత్తం అట్టుడుకుతోంది. నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిందేనంటూ నిరసనలు మరింత ఉధృతం చేస్తున్నారు. మరోవైపు.. నిరసనలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే బుధవారం తలెత్తిన గందరగోళ పరిస్థితులను తప్పుపట్టారు ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి తీవ్ర శిక్షలు ఉంటాయని రైసీ హెచ్చరించారు.

‘పౌరుల రక్షణే ఇరాన్‌ ప్రజల రెడ్‌ లైన్‌. చట్టాన్ని అతిక్రమిస్తూ అల్లర్లకు పాల్పడేందుకు ఎవరికీ అధికారం లేదు. జాతీయ సమైక్యతను లక్ష్యంగా చేసుకొన్న శత్రువు.. ప్రజలను ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవాలని కోరుకుంటున్నాడు. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి కఠిన శిక్షలు ఉంటాయి. ఇది ప్రజల నిర్ణయం‘  అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్పష్టం చేశారు. నిరసనలకు, అల్లర్లకు ఎంతో తేడా ఉందని, ఇరాన్‌కు బద్ధశత్రువైన అమెరికానే ఈ అగ్గికి ఆజ్యం పోస్తోందంటూ ఆరోపించారు. మాసా అమీని మరణంతో దేశం ఎంతో చింతిస్తోందని.. ఫోరెన్సిక్‌, నిపుణుల బృందం నివేదిక త్వరలోనే వస్తుందని తెలిపారు.

హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగాలపై అరెస్టైన మాసా అమీని అనే 22 ఏళ్ల యువతి సెప్టెంబర్‌ 16న పోలీస్‌ కస్టడీలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇరాన్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. అమీని మరణించిన మరుసటి రోజు నుంచి మొదలైన నిరసనలు గత రెండు వారాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 76 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కొందరు భద్రతా సిబ్బంది ఉండగా.. ఎక్కువ మంది ఆందోళనల్లో పాల్గొన్న మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఇరాన్‌లో హిజాబ్‌ ఆందోళనల్లో... 50 మందికి పైగా బలి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top