టెహ్రాన్: ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు నెలలు (87 రోజులు) పాటు కొనసాగిన తీవ్రమైన ఇంటర్నెట్ బ్లాకౌట్ (సేవల నిలిపివేత)ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అంతర్జాతీయ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
గత ఐదు నెలలుగా ఇరాన్ తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని చవిచూస్తోంది. ఫిబ్రవరి 28 న అమెరికా దాడుల ప్రారంభకానికి ముందు సైతం ఆ దేశంలో తీవ్రంగా అంతర్గత సంక్షోభం తలెత్తింది. ఖమేనీ పాలనకు నిరసనగా ఆ దేశ యువత పెద్దఎత్తున రోడ్లెక్కారు. దీంతో ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ జనవరి 8న ఇరాన్ తొలిసారిగా ఆదేశాలు జారీ చేసింది. మధ్యలొ కొద్దిగా వెసులుబాటు ఇచ్చినప్పటికీ దాదాపుగా నాలుగు నెలల అనంతరం తొలిసారిగా ఆ సేవలనను పునరుద్దరించాలని నిర్ణయం తీసుకుంది.
ఇరాన్ సైబర్ స్పేస్ స్టీరింగ్ అండ్ ఆర్గనైజింగ్ హెడ్‌క్వార్టర్స్ ఉన్నత స్థాయి సమావేశంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో ఇంటర్నెట్ పునరుద్ధరణకు అనుకూలంగా 9 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు వచ్చాయి. అనంతరం ఈ వివరాలను ఇరాన్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ అధికారులు మీడియాకు తెలియజేశారు.
ఇంటర్నెట్ బ్లాకౌట్ కారణాలు
దేశంలో ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల కారణంగా జనవరి 8న తొలిసారిగా ఇంటర్నెట్ ఆంక్షలు విధించారు. అనంతరం జనవరి 23న ఈ ఆంక్షలను కొద్దిగా సడలించినప్పటికీ, ఫిబ్రవరి 28న అమెరికా ,జ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు.
ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ 'నెట్‌బ్లాక్స్' ప్రకారం.. సాధారణంగా 90% నుండి 100% ఉండే ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఈ బ్లాకౌట్ సమయంలో కేవలం 1% నుండి 2% శాతానికి పడిపోయింది. ఆధునిక ఇంటర్నెట్ చరిత్రలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన, తీవ్రమైన బ్లాకౌట్ అని నెట్‌బ్లాక్స్ పేర్కొంది. ఇంటర్నెట్ నిలిచిపోవడంతో సైనిక ఉద్రిక్తతల సమయంలో ప్రజలు తమ కుటుంబ సభ్యులను సంప్రదించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. స్వతంత్ర సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కూడా కోల్పోయారు.
నిరుద్యోగం
యుద్ధం, నిరసనలు మరియు ఇంటర్నెట్ ఆంక్షల కారణంగా దేశంలో దాదాపు 10 లక్షల (1 మిలియన్) మందికి పైగా ఉపాధి కోల్పోయినట్లు 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' నివేదించింది. సోషల్ మీడియా ప్రకటనలపై ఆధారపడిన చిన్న వ్యాపారాలు, ఫ్రీలాన్సర్లు, టెక్ స్టార్టప్‌లు మరియు సాఫ్ట్‌వేర్ డెవలపర్ల ప్రాజెక్టులు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొంది.


