Who Is Rishi Sunak: బ్రిటన్ తదుపరి ప్రధానిగా భారత సంతతి వ్యక్తి! అదే నిజమైతే చరిత్రే..

Indian Origin Rishi Sunak in Race For UK Next Prime Minister Here Are Five Key Points About Him - Sakshi

లండన్‌: బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ వైదొలగడం ఖాయమని వార్తలు వస్తున్న తరుణంలో కొత్త ప్రధాని ఎవరు? అనే విషయంపై జోరుగా చర్చ మొదలైంది. అయితే పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ భారత సంతతికి చెందిన రిషి సునక్‌ ఈ రేసులో ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటివరకు ప్రధాని బోరిస్ జాన్సన్ కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా సేవలందించారు రిషి. అయితే బోరిస్‌పై అసంతృప్తితో అందరికంటే ముందుగా మంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఆ తర్వాత చాలా మంది ఆయన బాటలోనే నడిచారు. మొత్తం 54 మంది మంత్రులు తమ పదులకు రాజీనామా చేశారు. దీంతో గత్యంతరం లేక ప్రధానిగా తప్పుకునేందుకు బోరిస్ అంగీకరించినట్లు బ్రిటన్ మీడియా తెలిపింది.

అయితే భారత మూలాలున్న రిషి గతంలో చాలా సార్లు వార్తల్లో నిలిచారు. ఆయనకు సంబంధించి  ఐదు కీలక విషయాలు ఇప్పుడు చూద్దాం.

రిషి సునక్ వయసు 42 ఏళ్లే. 2020లో బోరిస్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక తన తొలి కేబినెట్‌లో రిషిని ఆర్థిక మంత్రిగా నియమించారు. 

కరోనా సంక్షోభ సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం వందల కోట్ల పౌండ్ల ప్యాకేజీ తీసుకొచ్చి రిషి మంచి గుర్తింపు పొందారు. నూతన ప్రధాని రేసులో రక్షణశాఖ మాజీ మంత్రి పెన్నీ మోర్డాంట్‌తో పాటు రిషి సునక్‌ తమ ఫేవరేట్ అని బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్నారు.

అయితే రిషిపై కొన్ని వివాదాలు కూడా ఉండటం ఆయనకు కాస్త మైనస్‌గా మారే అవకాశం ఉంది. తన భార్య ట్యాక్స్ వివాదం, అమెరికా గ్రీన్‌ కార్డు, బ్రిటన్‌ జీవన వ్యయం సంక్షోభం సమయంలో ఆయన కాస్త నెమ్మదిగా స్పందించారనే ఆరోపణలు ఉన్నాయి.

డౌన్‌స్ట్రీట్‌లో సమావేశానికి హాజరై కోడివ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిషికి జరిమానా విధించారు.

రిషి గ్రాండ్ పేరెంట్స్ పంజాబ్‌కు చెందినారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఒకవేళ రిషి బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎంపికైతే చరిత్ర సృష్టిస్తారు. బ్రిటన్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా నిలుస్తారు.

ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్‌ కన్జర్వేటిప్ పార్టీ నాయకుడిగా ఈరోజే రాజీనామా చేస్తారని బ్రిటన్ మీడియా తెలిపింది. తదుపరి ప్రధాని ఎంపిక జరిగే వరకు ప్రధాని పదవిలో ఆయనే కొనసాగుతారని తెలిపింది. ఈ ప్రక్రియ అక్టోబర్‌లో పూర్తయ్యే అవకాశముంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top