ముసుగు పూర్తిగా తొలగింది.. ఇరకాటంలో పాక్‌! | Operation Sindoor: Terror Leader Admit Muridke, Bahawalpur Camp Destroyed | Sakshi
Sakshi News home page

ముసుగు పూర్తిగా తొలగింది.. ఇరకాటంలో పాక్‌!

Sep 19 2025 2:09 PM | Updated on Sep 19 2025 2:50 PM

India OP Sindoor Strike Echoes: LeT Admits Damage Pakistan Denies Links

అబ్బే.. ఆపరేషన్‌ సిందూర్‌తో మా భూభాగంలో వేటికి డ్యామేజ్‌ కాలేదు. పైగా ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్‌తో కౌంటర్‌ ఆపరేషన్‌ చేసి భారత యుద్ధ విమానాలను నేలకూల్చాం.. ఇదీ ఇప్పటికీ పాకిస్థాన్‌ చెబుతున్న మాట. కళ్లెదుట ఉగ్రస్థావరాలు, సైనిక శిబిరాలు నేలమట్టం అయిన ఆధారాలు కనిపిస్తున్నా కూడా పాక్‌ ఈ వాదన నుంచి పక్కకు పోవడం లేదు. ఈ క్రమంలో పాక్‌ను ఇరకాటంలో పడేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. 

భారత్‌ జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌లో తమ స్థావరం ధ్వంసమైందంటూ ఇటీవల జేషే కమాండర్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇది చర్చలో ఉండగానే.. తాజాగా లష్కరే తాయిబా అలాంటి ప్రకటనే చేసింది. ముర్దిక్‌లో తమ స్థావరం భారత దాడుల్లో నాశనమైందంటూ ఎల్‌ఈటీ కమాండర్‌ ఖాసిమ్‌ అంగీకరించాడు. ఈ మేరకు ఓ వీడియో సైతం అతను పోస్ట్‌ చేశాడు.

ఇది మళ్లీ నిర్మాణంలో ఉంది. అల్లా కృపతో ఇది ముందుకన్నా పెద్దదిగా నిర్మించబడుతుంది. ఈ శిబిరంలో ముజాహిదీన్, తాలిబులు (students) శిక్షణ పొందారని కూడా వెల్లడించాడు. అయితే.. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ భవనం ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించడంలేదని చెబుతున్నప్పటికీ.. LeT డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ మరో వీడియోలో పాక్ ప్రభుత్వం, ఆర్మీ ఈ కేంద్రాన్ని పునర్నిర్మించేందుకు నిధులు అందించాయని చెప్పడం కొసమెరుపు. దీంతో.. తమ భూభాగంలో ఉగ్ర స్థావరాలే లేవంటూ అసత్యాలు వల్లెవేస్తోన్న పాక్‌ ముసుగు తొలగిందని, ఉగ్ర సంస్థల బహిరంగ ప్రకటన చెంపపెట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఆపరేషన్‌ సిందూర్ 2025 మే 7న భారత సాయుధ దళాలు చేపట్టిన మెరుపు దాడి. ఇది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఈ దాడిలో పాల్గొన్నాయి. ఈ దాడితో లష్కరే తోయిబా, జైష్-ఏ-మొహమ్మద్ వంటి సంస్థల మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement