బంధం బలోపేతం | India-Italy upgrade ties to Special Strategic Partnership | Sakshi
Sakshi News home page

బంధం బలోపేతం

May 21 2026 5:04 AM | Updated on May 21 2026 5:04 AM

India-Italy upgrade ties to Special Strategic Partnership

ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంతో సంబంధాలు ఉన్నత స్థాయికి..  

ద్వైపాక్షిక వాణిజ్యం 2029 నాటికి 20 బిలియన్‌ యూరోలకు  

రోమ్‌లో భారత ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మెలొనీ భేటీ  

ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవాలని నిర్ణయం  

కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అంగీకారం  

పశ్చిమాసియాలో శాంతికి చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని వెల్లడి  

రోమ్‌: భారత్, ఇటలీ మధ్య బంధం మరింత బలపడింది. ఇరుదేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి. పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2029 నాటికల్లా 20 బిలియన్‌ యూరోలకు చేర్చాలని నిర్ణయించుకున్నాయి. రక్షణ పారిశ్రామిక రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీ బుధవారం రోమ్‌లో సమావేశమయ్యారు. 

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవాలని తీర్మానించారు. పశ్చిమాసియా సంక్షోభం, తద్వారా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మోదీ, మెలొనీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఉద్రిక్తతలు సాధ్యమైనంత త్వరగా చల్లారాలని ఆకాంక్షించారు. శాశ్వతమైన శాంతి సాధనకు చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని తేల్చిచెప్పారు. హార్మూజ్‌ జలసంధిని తక్షణమే తెరవాలని, స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలని ఇరువురు నేతలు విజ్ఞప్తి చేశారు.  

ఎఫ్‌టీఏను త్వరగా అమలు చేయాలి  
కొన్ని నెలల క్రితం ఖరారైన భారత్‌–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) ద్వారా లభించే అవకాశాలను సది్వనియోగం చేసుకోవాలని మోదీ, వెలొనీ నిర్ణయానికి వచ్చారు. ఆ ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. జార్జియా మెలొనీతో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, ఇటలీ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేర్చినందుకు చాలా సంతోషిస్తున్నానని తెలిపారు. 

‘భారత్‌–ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025–29’మన భాగస్వా మ్యానికి ఆచరణాత్మక, భవిష్యత్‌ దృష్టితో కూడిన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుందన్నారు. ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 20 బిలియన్‌ యూరోల లక్ష్యం వైపు వేగంగా దూసుకుపోతోందని హర్షం వ్యక్తంచేశారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో నౌకాయాన స్వేచ్ఛ ఉండాలని మెలొనీ స్పష్టంచేశారు. ఆ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. భారత్‌–ఇటలీ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం నుంచి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరడం సంతోషంగా ఉందన్నారు.  

సాంకేతికత, ఆవిష్కరణలే చోదక శక్తులు  
భారత్‌–ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025–29ని సమీక్షించి, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించేందుకు విదేశాంగ మంత్రుల నేతృత్వంలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి భారత్, ఇటలీ అంగీకరించాయి. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పరిశోధన, నూతన ఆవిష్కరణలు, ఇంధనం, కృత్రిమ మేధ(ఏఐ), అరుదైన సాంకేతికతలు, విద్య, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల విషయంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని మోదీ, మెలోనీ నిర్ణయించారు. 

రెండుదేశాల భాగస్వామ్యానికి సాంకేతికత, ఆవిష్కరణలే చోదక శక్తులు అని మోదీ స్పష్టంచేశారు. ఏఐ, క్వాంటం, అంతరిక్షం, పౌర అణుశక్తి వంటి రంగాల్లో పరస్పర సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రెండు దేశాల్లోని స్టార్టప్‌లు, పరిశోధనా కేంద్రాలు, పరిశ్రమలను అనుసంధానించడానికి ఇండియా–ఇటలీ ఇన్నోవేషన్‌ సెంటర్‌పై పనిచేస్తున్నామని వివరించారు. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం పరస్పర విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. సముద్ర భద్రతా సహకారం, సమన్వయం, సమాచార మారి్పడి, ఉత్తమ పద్ధతులను పెంపొందించే లక్ష్యంతో సముద్ర భద్రతపై ఒక కార్యాచరణ ప్రారంభించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. 

కొలోజియం సందర్శన
మోదీ మంగళవారం రాత్రి ఇటలీకి చేరుకున్నారు. ప్రధాని మెలొనీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ గౌరవార్థం ప్రత్యేక విందు ఇచ్చారు. తర్వాత రోమ్‌లోని ప్రాచీన కట్టడం కొలోజియంను ఇరువురు నేతలు కలిసి సందర్శించారు. వేర్వేరు కీలక అంశాలపై తాము అభిప్రాయాలను పంచుకున్నామని మోదీ సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. ఇదిలా ఉండగా>, ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాలారెల్లాతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, కీలక ఖనిజాలు, ఏఐ, అంతరిక్షం, అణుశక్తి వంటి రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవడంపై చర్చలు జరిపారు. మోదీ యూరప్‌ పర్యటన బుధవారం ముగిసింది.  

ప్రధాని మోదీకి ఎఫ్‌ఏఓ అగ్రికోలా
ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక పతకం లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఏఓ) ఆయనను అగ్రికోలా మెడల్‌తో సత్కరించింది. ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో చేసిన విశేషమైన కృషికి గాను మోదీకి ఈ ప్రతిష్టాత్మక పతకం దక్కింది. బుధవారం రోమ్‌లో ఎఫ్‌ఏఓ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఖూ డాంగ్‌యూ చేతుల మీదుగా మెడల్‌ అందుకున్నారు. ఈ గౌరవం ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి పట్ల భారతదేశానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను, వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్నవారి కృషిని ప్రతిబింబిస్తోందని మోదీ వెల్లడించారు. ఇది భారతదేశంలోని రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు దక్కిన గొప్ప గౌరవమని అభివర్ణించారు.

మెలొనీకి ‘మెలొడీ’ గిఫ్ట్‌
ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలొనీకి మెలొడీ చాక్లెట్ల ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు గాను మోదీకి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఒక వీడియోను షేర్‌ చేశారు. ‘‘ప్రధాని మోదీ నా కోసం మంచి బహుమతి తీసుకొచ్చారు. చాలాచాలా మంచి చాక్లెట్లు తెచ్చారు. మెలొడీ అందించారు. ఆయన ఇచ్చిన బహుమతికి ధన్యవాదాలు’’అని పేర్కొన్నారు. తనకు అందిన బహుమతిని చూపిస్తూ మెలొనీ సరదాగా ‘మెలొడీ’అనడంతో మోదీ బిగ్గరగా నవ్వేశారు. మోదీ, మెలొనీలకు మెలొడీతో అనుబంధం ఉంది. ఇద్దరి పేర్ల కలయికతో ఏర్పడిన ‘మెలొ డీ’అనే హ్యాష్‌ట్యాగ్‌ను 2023లో దుబాయ్‌లో జరిగిన కాప్‌ సదస్సు సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి సృష్టించారు. ఆ తర్వాత పలు కార్యక్రమాలలో ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణల కారణంగా ఈ పదం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  

10 అవగాహన ఒప్పందాలు  
మోదీ–మెలోని చర్చల అనంతరం సైనిక హార్డ్‌వేర్, ప్లాట్‌ఫారమ్‌ల సహ–అభివృద్ధి, సహ–ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తూ భారత్, ఇటలీ దేశాలు ఒక రక్షణ పారిశ్రామిక రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించాయి. అంతేకాకుండా ఉన్నత విద్య, ఇటలీకి భారతీయ నర్సుల రాకపోకల కోసం ఇరు దేశాలు కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేశాయి. అరుదైన ఖనిజాలు, వ్యవసాయం, సముద్ర రవాణా, సముద్ర ఉత్పత్తులు తదితర రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా 10 అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) భారత్, ఇటలీ సంతకాలు చేశాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement