ప్రపంచాన్ని ఓ వైపు యుద్ధం కుదిపేస్తుంటే అమెరికాలో మాత్రం ఇమ్మిగ్రేషన్ నిబంధనల పేరుతో అధికారులు ఆగడాలు ఏంతమాత్రం ఆగడం లేదు. అమెరికాలో 35 ఏళ్లుగా నివాసముంటున్న భారత్‌కు చెందిన ఒక మహిళను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.
మీనూ బాత్రా అనే 53 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళ వేరే ప్రాంతానికి ప్రయాణం కోసం మార్చి 17 న హర్గింగన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తన విమానం కోసం ఎయిర్‌పోర్టు వద్ద ఎదురుచూస్తుండగా హఠాత్తుగా ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులు వచ్చి తన చేతికి సంకెళ్లు వేసి తనను అరెస్టు చేశారు. అనంతరం రేమండ్ విల్లాలోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. తనకు చట్టపరమైన పరిమితి ఉందని ఎంత వాదించినా వారు పట్టించుకొనే యత్నం చేయలేదు.
అయితే దీనిపై మీనూ బాట్రా స్పందించారు. " నన్ను ఒక ఖైదీలా చూశారు. ఆ సమయంలో నాకు ఏం చేయాలో తెలియని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. విచారణ సమయంలో 24 గంటలపాటు ఎటువంటి ఆహారం ఇవ్వలేదు. కనీసం మంచినీరు కూడా అందించలేదు. అరెస్టు తర్వాత తనను చేతులు వెనక్కి పెట్టి బేడీలు వేసినట్లు కనిపించేలా ఫోటోలు తీయించుకోవాలని అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో నేను చాలా అవమానానికి గురయ్యాను, నన్ను ఒక నేరస్థురాలిలా ట్రీట్ చేశారు" అని ఆమె మీడియా ఎదుట వాపోయారు.
దీంతో బాత్రా అనే మహిళ తన అరెస్టును సవాలు చేస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు మొదటి 24 గంటల పాటు ఎలాంటి ఆహారం, నీరు లేకుండా నిర్బంధించారని, కనీసం తన మందులను కూడా ఇవ్వడానికి నిరాకరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా బాత్రా 35 ఏళ్లకు పైగా అమెరికాలో నివసిస్తున్నారు. టెక్సాస్‌లో పంజాబీ, హిందీ మరియు ఉర్దూ భాషలకు గుర్తింపు పొందిన ఏకైక కోర్టు ఇంటర్‌ప్రెటర్‌గా (అనువాదకురాలిగా) ఇమ్మిగ్రేషన్ కోర్టులో కొన్నేళ్లుగా వందలాది మందికి సహాయం చేశారు. ఇలాంటి గుర్తింపు ఉన్న వ్యక్తులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్కడ అరెస్టు చేస్తే సాదారణ వ్యక్తుల పరిస్థితి ఏంటని అక్కడి భారతీయులు ఆందోళన చెందుతున్నారు.


