ప్రపంచాన్ని చుట్టివచ్చిన వీరుడు.. వేల కోట్లకు అధిపతి.. విమానంలో దిక్కులేని చావు..

Howard Robert Hughes Autobiography Painful Death Sakshi Secret

కొంతమంది గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. చాలా మంది ఒకటి రెండు విషయాల్లో రాణిస్తేనే కాలరెగరేస్తారు. చాలా తక్కువ మంది మాత్రం ఇంకా ఏదో సాధించాలని తపిస్తారు ఎంత సాధించినా ఇంకా దాహంతోనే ఉంటారు. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోగలిగిన స్థాయికి ఎదిగి.. దిక్కుమాలిన శవంగా మిగిలి.. మరణానంతరం కోట్లాది డాలర్ల సామాజిక సేవలో చిరంజీవిగా ఉన్న ఓ సంపన్నుడి కథే ఇవ్వాల్టి సీక్రెట్.

1976 ఏప్రిల్ 5 మెక్సికో నుంచి హోస్టన్ వచ్చిన ఓ ప్రయివేట్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఓ గుర్తు తెలీని వ్యక్తి మరణించి ఉన్నాడు. ఏళ్ల తరబడి తైల సంస్కారం లేకుండా పొడుగ్గా పెరిగిన జుట్టు.... అంతే కాలంగా పెరుగుతూ వచ్చిన చేతి.. కాలి గోళ్లు... నెలల తరబడి ఏమీ తినలేదేమో అన్నట్లు చిక్కి శల్యమైన శరీరం. ఆరడుగుల రెండంగుళాల పొడగరి అయినా శరీరంలో మాంసమే లేనట్లు 41కిలోలు మాత్రమే తూగిన మృతదేహం.  ఎవరూ బాడీని గుర్తించే పరిస్థితే లేదు.  ఎఫ్.బి.ఐ. రంగంలోకి దిగింది. అటాప్సీ చేసిన వైద్యులు కిడ్నీ ఫెయిల్యూర్ కావడం వల్లనే చనిపోయాడని తేల్చారు. మాల్ న్యూట్రిషన్ వల్ల దేహమంతా డొల్లయ్యిందని విశ్లేషించారు. అంత తినడానికి కూడా గతి లేని ఈ మనిషి విమానంలో ఎలా వచ్చాడు? 

ఈ అనుమానమే ఎఫ్. బి. ఐ. ని మరింత లోతుగా దర్యాప్తుచేసేలా చేసింది. ఇతని ఫింగర్ ప్రింట్స్ సేకరించి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టింది. అతనెవరో తెలిశాక అందరూ కళ్లు తేలేశారు. సరైన ఆహారం లేక బక్కచిక్కిన ఈ మనిషి అల్లా టప్పా మనిషి కానే కాదు. మొత్తం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడితను. ఇతనే ద గ్రేట్ హోవర్డ్ రాబర్డ్ హ్యూగ్స్. ఇతని దగ్గరున్న సంపదతో ప్రపంచంలోని కొన్ని దేశాలను కొనేయగలడు. ఇతను కనుసైగ చేస్తే చాలు ఏం కావాలంటే అది వచ్చి ఒళ్లో వాలుతుంది. ఇంతటి రిచెస్ట్ పెర్సన్ కి ఇంత దిక్కులేని చావేంటి? అదే మానవ జీవితంలోని ఐరనీ. అగ్రరాజ్యం  అమెరికానే శాసించగల హ్యూగ్స్ మృత దేహాన్ని గ్లెన్ వుడ్ స్మశాన వాటికలో ఖననం చేశారు. మల్టీ బిలియనీర్ అయిన హ్యూగ్స్ ఇక్కడ శాస్వతంగా నిద్రపోతున్నాడు.  ఇంతకీ హ్యూగ్స్ ఏం చేసేవాడో  అంత గొప్పవాడిగా ఎదిగే క్రమంలో ఎంత కఠోర శ్రమ చేశాడో  అతని జీవితంలో ఎన్ని మజిలీలున్నాయో తెలుసుకోవాలంటే అతని ఆటోబయోగ్రఫీని ఓ సారి తెరవాలి. 

హోవర్డ్ రాబర్డ్ హ్యూగ్స్  అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అమెరికన్ ఏవియేటర్. విమానంలో అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వీరుడిగా హ్యూగ్స్ రికార్డ్ సృష్టించాడు.  కేవలం నాలుగు రోజుల వ్యవథిలోనే లోకాన్ని చుట్టి పారేశాడు.  ఆ తర్వాత తన రికార్డును తానే తిరగరాశాడు. ఈ సారి మూడు రోజుల్లోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు. హ్యూగ్స్ అంటే ఇంతేనా అనకండి.  ఇంకా చాలా ఉంది.  హ్యూగ్స్ మంచి ఏవియేటరే కాదు.....ప్రపంచంలోనే అత్యంత పెద్ద విమాన తయారీ కంపెనీకి ఓనర్ కూడా. ఔను .. అమెరికాలో హ్యూగ్స్ ఎయిర్ లైన్స్ నంబర్ వన్ ప్రయివేట్ కంపెనీ. 

ఎయిర్ క్రాఫ్ట్ లంటే హ్యూగ్స్ కి ఆరో ప్రాణం. ఆ మాటకొస్తే అసలదే మొదటి  ప్రాణం కూడా. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరే కాదు ఎఫిషియంట్ పైలట్ గానూ హ్యూగ్స్ కు పేరుంది.  కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ లను అతనే స్వయంగా డిజైన్ చేశాడు. తండ్రి ఇచ్చిన హ్యూగ్స్ టూల్ కంపెనీ ని శాఖోప శాఖలుగా విస్తరించాడు హ్యూగ్స్ జూనియర్. ముందుగా ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీని ఫ్లోట్ చేశాడు. 1932 లో కాలిఫోర్నియాలో ఓ రెంటల్ కార్నర్ లో దీన్ని స్టార్ట్ చేశాడు.  కొంత మంది ఆలోచనలు కూడా భారీగానే ఉంటాయి. అందరూ నేలపై చూపులు పెడితే వీళ్లు మాత్రం ఆకాశంలో చుక్కలపైనే దృష్టి సారిస్తారు. 27 ఏళ్ల వయసులో ఓ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీకి ఓనరయ్యాడు.  ఏడేళ్లలోనే ఈ సంస్థ నంబర్ వన్ గా అవతరించింది.

గంటకు 352కిమీ రికార్డు..
1939 లో ట్రాన్స్ ఇంటర్నేషనల్ వెస్ట్ ఎయిర్ లైన్స్ -T.W.I. లో మేజర్ షేర్ ను హ్యూగ్స్ కొనుగోలు చేశాడు.  అతని దృష్టిలో విమానాల తయారీ..ఎయిర్ లైన్స్ యాక్టివిటీస్ కేవలం వ్యాపారాలు కావు. ఈ రెండూ హ్యూగ్స్ కి ప్రొఫెషనల్ పేషన్సే. T.W.I. పై పూర్తి కంట్రోల్ రావడంతోనే హ్యూగ్స్ వైమానిక రంగానికి రారాజైపోయాడు. అతన్నిలాగే వదిలేస్తే ఇక తమ వ్యాపారాలు మూసుకోవలసిందేనని పాన్ అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థ ఓనర్ ట్రిప్ కు భయం పట్టుకుంది.  అతని భయానికి తగ్గట్టే హ్యూగ్స్ ఎయిర్ లైన్స్ లో దూసుకుపోతున్నాడు.  స్వతహాగా పైలట్ కూడా అయిన హ్యూగ్స్ H1 రేసర్ టెస్ట్ రన్ లోనే గంటకు 352 కిలోమీటర్ల వేగంతో నడిపి రికార్డు సృష్టించాడు.

రాజకీయంగా పాన్ అమెరికన్ ఎయిర్ లైన్స్ వేధింపులు- ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ఘటనలతో హ్యూగ్స్ మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. మానసిక పరిస్థితి దెబ్బతింది. అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అనే మానసిక రుగ్మత మొదలైంది.  ఒక్కోసారి ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలిసేది కాదు. ఒకే మాటను అదే పనిగా రిపీట్ చేసేవాడు. ఓ దశలో కొంతకాలం పాటు ఓ గదిలో తలుపులు వేసుకుని ఉండిపోయేవాడు. తాను తీసిన సినిమాలతో పాటు తనకు నచ్చిన సినిమాలను చూస్తూ గడిపేవాడు. ఓ కుర్చీలో నగ్నంగా కూర్చుని పిచ్చిపిచ్చిగా సినిమాలు చూసేవాడు. సన్నిహితుల సమాచారం ప్రకారం ఒక్కోసారి రోజుల తరబడి స్నానం చేసేవాడు కాదు. చాకొలెట్ బార్స్- పాలే ఆహారం. అవిలేకపోతే ఏమీ తినకుండా అలాగే ఉండిపోయేవాడు. కాలిగోళ్లు చేతి గోళ్లు బాగా పెరిగిపోయినా పట్టించుకునేవాడు కాదు. జుట్టు పెరిగిపోయి తైల సంస్కారం లేకుండా రోజుల తరబడి అలాగే ఉండిపోయేవాడు. చూడ్డానికి భయంకరంగా కనిపించేవాడు.

హోటల్ బిల్లు రూ.కోట్లు..
అప్పటికే ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకడిగానే ఉన్నాడు. చివరి దశలో మెక్సికోలో ఓ హోటల్లో కాలక్షేపం చేశాడు. ఆ హోటల్ బిల్లే కొన్ని కోట్లు పే చేశాడు. సరిగ్గా తినక పోవడం వల్ల ఒళ్లంతా గుల్లయింది.  42 కిలోల బరువుకు పడిపోయాడు.  కిడ్నీలు ఇక పనిచేయలేమని మొరాయించాయి. ఈ టైమ్ లోనే తాను పుట్టిన హోస్టన్ నగరానికి ఓ స్నేహితుని విమానంలో బయలుదేరాడు.  చివరికి అందులోనే చివరి శ్వాస విడిచాడు. ఏ విమానాలనైతే జీవితాంతం ప్రేమించాడో ఏ విమానాల తయారీ కోసం తన మేథస్సునూ డబ్బునూ ఖర్చు చేశాడో ఆ విమానంలోనే అంతిమయాత్ర చేశాడు.

హ్యూగ్స్ మరణానంతరం అతని విల్లు ప్రకారం ఆస్తిలో 75శాతం మొత్తాన్ని ఈ ఇన్ స్టిట్యూట్ కే అప్పగించారు. ఇప్పటికీ ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద మెడికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ గా ఇది చెలామణీ అవుతోంది. ఈ ఇన్ స్టిట్యూట్ ద్వారా ఇప్పటికీ జన హృదయాల్లో బతికే ఉన్నాడు హ్యూగ్స్. అమెరికాలో హ్యూగ్స్ ను ఇప్పటికీ ఒక ఐకాన్ గానే కొలుస్తారు. మనసున్న మారాజని జనం నీరాజనాలు పడతారు. చచ్చీ కూడా బతికుండడమంటే ఇదే. అందుకే హ్యూగ్స్ ఎప్పటికీ చిరంజీవే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top