
మధ్యప్రాచ్యంలో మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పేందుకు కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. 24 మంది బందీల విడుదలతో పాటు 60 రోజుల కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు హమాస్ రహస్య లేఖ పంపినట్లు సమాచారం. మరోవైపు, గాజా యుద్ధం ముగింపునకు శాంతి ప్రణాళికను ట్రంప్ సిద్ధం చేసినట్లు పలు వార్త కథనాలు వెల్లడిస్తున్నాయి. దోహాలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిన తర్వాత గాజా శాంతి చర్చలు నిలిచిపోగా.. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌తో హమాస్ సంప్రదింపులకు ప్రయత్నం చేస్తోంది. అయితే, ట్రంప్ బృందం ఈ విషయంపై స్పందించలేదు.
కాగా, గాజా నగరంపై గట్టి పట్టున్న హమాస్‌తో అమీతుమీ తేల్చుకుంటామంటూ భారీగా సైనికులను రంగంలోకి దించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. దాడుల తీవ్రతను కొనసాగిస్తోంది. శుక్రవారం( సెప్టెంబర్ 19) రాత్రి నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ గాజా వ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో సుమారుగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గాజా నగరంలోని షావా స్క్వేర్ సమీపంలో జరిగిన దాడిలో ఐదుగురు, మరో దాడిలో ఒకే కుటుంబంలోని ఆరుగురు చనిపోయారు.
గత 23 నెలలుగా ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా సాగిస్తున్న దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 65,100 దాటిపోయింది. భవనాలను నేలమట్టం చేస్తుండటంతో గాజా ప్రాంతంలో ఉన్న కనీసం 90 శాతం మంది పాలస్తీనియన్లకు నిలువ నీడ కూడా లేకుండాపోయింది. దాదాపు సగం మంది, అంటే సుమారు 4.50 లక్షల మంది గాజా నగరాన్ని వీడి వెళ్లిపోయినట్లు పాలస్తీనా సివిల్ డిఫెన్స్ విభాగం తెలిపింది. ఇలాఉండగా, గాజా ప్రాంతంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారుల కోసం తీసుకువచ్చిన అత్యవసర ఆహార పదార్థాలున్న నాలుగు ట్రక్కులను సాయుధులు వచ్చి తరలించుకుపోయారంటూ యునిసెఫ్ పేర్కొంది.