పాకిస్తాన్‌లో కలకలం.. హఫీజ్‌ సన్నిహితుడు హతం | Hafiz Saeed Close aide Sheikh Yousaf Afridi dead in Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో కలకలం.. హఫీజ్‌ సన్నిహితుడు హతం

Apr 29 2026 7:17 AM | Updated on Apr 29 2026 7:22 AM

Hafiz Saeed Close aide Sheikh Yousaf Afridi dead in Pakistan

లాహోర్‌: పాకిస్తాన్‌ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా కీలక నేత, ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ సన్నిహితుడు షేక్‌ యూసఫ్‌ అఫ్రిది గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో హతమయ్యాడు. ఖైబర్‌ ప్రావిన్స్‌లోని లాండికొటాల్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అఫ్రిది అక్కడికక్కడే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఖైబర్‌ ప్రావిన్స్‌లో లష్కరే కార్యకలాపాలను సమన్వయం చేయడంతోపాటు కొత్తవారిని చేర్చుకోవడం వంటివి ఇతడే పర్యవేక్షిస్తున్నాడు. ఖైబర్‌లోని జఖాఖెల్‌ గిరిజన తెగకు చెందిన అఫ్రిది సలాఫి వర్గం ముస్లిం పండితుల్లో ఒకడు. అఫ్రిదిపై కాల్పులకు బాధ్యత ఎవరూ ప్రకటించుకోలేదు. తెహ్రీక్‌–ఇ– తాలిబన్‌ పాకిస్తాన్‌ పనే అయి ఉండొచ్చని అనుమానాలున్నాయి. కాగా, వారం క్రితం లాహోర్‌లో లష్కరే వ్యవస్థాపకుల్లో ఒకడైన అమిర్‌ హంజాపై కాల్పులు జరగడం తెల్సిందే.  

షేక్‌ యూసఫ్‌ అఫ్రిది హత్య ఘటన ప్రాంతంలో ఆగ్రహాన్ని రేపింది. ఇదిలా ఉండగా.. 2023 నుండి పాకిస్తాన్‌లో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి గ్రూపులకు చెందిన పలువురు నాయకులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురవుతున్నారు. ఇది మిస్టరీగా మారింది. అఫ్రిది హత్య పాకిస్తాన్‌లో ఇటీవల పెరుగుతున్న లక్ష్యిత దాడులలో భాగంగా జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్రిది మరణం లష్కరే తోయిబా ప్రాంతీయ నిర్మాణానికి పెద్ద దెబ్బగా మారింది. అతడి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement