అతడి వయసు 89 ఏళ్లు. ఆ వయసులో చేతిలో గన్ పట్టుకుని తిరుగుతూ కొందరిపై కాల్పులు జరుపుతూ కలకలం రేపాడు. గ్రీక్‌లోని అథెన్స్ నగర కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
సెంట్రల్ అథెన్స్‌లోని ఒక సొసైటీ సెక్యూరిటీ ఆఫీస్, అలాగే ఒక కోర్టు భవనంలో కాల్పులు జరిపి కొందరిని గాయపరిచాడు ఆ వృద్ధుడు. నిందితుడిని గుర్తించడానికి పోలీసులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాట్‌గన్ (ఒకేసారి అనేక గుళ్లను పేల్చే తుపాకీ)తో ఉన్న వృద్ధుడు మొదట గ్రీకు రాజధాని కేంద్రంలోని సొసైటీ సెక్యూరిటీ ఆఫీస్‌లో కాల్పులు జరిపి ఒక ఉద్యోగిని గాయపరిచాడు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తికి చికిత్స అందించారు. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
అదే వ్యక్తి తర్వాత సెంట్రల్ అథెన్స్‌లోని మరో ప్రాంతంలో ఉన్న కోర్టు భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ కూడా పలువురు గాయపడ్డారు. అధికారులు షాట్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ కాల్పుల వెనుక ఉద్దేశం స్పష్టంగా లేదు. కోర్టు భవనంలో కాల్పుల తర్వాత నిందితుడు కొన్ని పత్రాలు ఉన్న కవర్లను నేలపై విసిరేశాడు.
గ్రీకు జాతీయ సామాజిక భద్రత నిధి చీఫ్ అలెగ్జాండ్రోస్ వార్వెరిస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సెంట్రల్ అథెన్స్‌లోని కెరామైకోస్ ప్రాంతంలోని కార్యాలయం 4వ అంతస్తుకు వెళ్లి, ఒక ఉద్యోగిని తల దించుకో అని చెప్పిన తర్వాత కాల్పులు జరిపాడు. ఆ కాల్పులో మరో ఉద్యోగి కాలికి గాయాలయ్యాయి. నిందితుడు ట్రెంచ్‌కోట్ (పొడవైన కోట్)లో షాట్‌గన్ దాచుకున్నాడు.
“అతడు లోపలికి వెళ్లి 4వ అంతస్తుకు చేరుకున్నాడు. షాట్‌గన్ ఎత్తి ఒక ఉద్యోగికి తల దించుకోమని చెప్పి, మరొకరిని గాయపరిచాడు” అని వార్వెరిస్ ఈఆర్టీ రేడియోకు చెప్పారు. గాయపడ్డ ఉద్యోగినే లక్ష్యంగా తీసుకుని కాల్పులు జరిపినట్లు కనిపించలేదని తెలిపారు. గాయపడ్డ ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలోనే పోలీసులు అతని కాలికి టోర్నికెట్ (రక్తస్రావం ఆపేందుకు బిగించి కట్టే పట్టు) పెట్టారు. గ్రీక్‌లో తుపాకీ హింస తక్కువగా ఉంటుంది. అక్కడ తుపాకులకు అనుమతులు అంత సులభంగా ఇవ్వరు.


