అమెరికాలో ఉంటూ దరఖాస్తు చేయడం కుదరదు
యూఎస్ సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసు వెల్లడి
వాషింగ్టన్: విదేశీ పౌరులు అమెరికాలో నివసిస్తూ అమెరికాలో శాశ్వత నివాసిత హోదా లేదా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలంటే స్వదేశానికి తిరిగి వెళ్లక తప్పదు. అమెరికా నుంచే దరఖాస్తు చేసుకోవడం కుదరదు. సొంత దేశం నుంచి చేసుకోవాల్సిందే. ఈ విషయాన్ని యూఎస్ సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసు(యూఎస్‌సీఐఎస్) తాజాగా వెల్లడించింది.
తాత్కాలికంగా అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోరుకునే విదేశీయులు అసాధారణ పరిస్థితులు మినహా, దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని యూఎస్‌సీఐఎస్ ప్రతినిధి జాక్ కాహ్లర్ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. విదేశీయులు అమెరికా వలస విధానాన్ని సరిగ్గా పాటించాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. అమెరికా చట్టాల అసలు లక్ష్యం ఇదేనని ఇన్నారు. విదేశీయులు తమ స్వదేశం నుంచే దరఖాస్తు చేసుకుంటే వారికి ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు.
ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే అజ్ఞాతంలోకి జారుకొని అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండిపోవాలనే అవసరం ఉండదన్నారు. వారిని వెతికి పట్టుకొని, బయటకు పంపే అగత్యం కూడా తొలగిపోతుందని వివరించారు. విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు లేదా పర్యాటక వీసాలపై వచ్చిన వారు కాకుండా ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కొద్దికాలం పాటు అమెరికాకు వచ్చినవారు పని పూర్తయ్యాక కచ్చితంగా తిరిగి వెళ్లిపోయేలా తమ వ్యవస్థను రూపొందించినట్లు యూఎస్‌సీఐఎస్ తెలియజేసింది. వారి ఆగమనం గ్రీన్ కార్డ్ ప్రక్రియలో మొదటి అడుగుగా ఉండకూడదని అభిప్రాయపడింది.


