కాపాడతారనుకుంటే ముంచేశారు.. గ్రీసు బోటు ప్రమాద బాధితులు 

Greek Boat Disaster Survivors Blame Greece Coast Gaurds - Sakshi

ఏథెన్స్: మధ్యధరా సముద్రంలో ప్రయాణిస్తూ గ్రీసు వైపుగా వచ్చి మునిగిపోయిన బోటులో ప్రాణాలు దక్కించుకున్న కొందరు విస్తుపోయే నిజాలను చెబుతున్నారు. గ్రీసు తీర రక్షక దళాల బృందాలను చూడగానే వారు మమ్మల్ని కాపాడతారని అనుకున్నాము కానీ వారే మా పడవ మునిగిపోవడానికి కారణమని చెప్పారు.

ఇటీవల ఆఫ్రికా నుండి ఐరోపా దేశాలకు వలస వస్తోన్న ఒక బోటు నీటమునిగిన సంగతి తెలిసిందే. 750కు పైగా వలసదారులు ప్రయాణిస్తున్న ఆ బోటు ప్రమాదంలో 80 మంది మృతి చెందగా 104 మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. మిగతా వారంతా గల్లంతయ్యారు. 

వీరిలో అత్యధికులు పాకిస్తాన్, సిరియా, ఈజిప్టు దేశాలకు చెందినవారే. అయితే వీరిలో ప్రాణాలు దక్కించుకున్న ఈజిప్టు వ్యక్తిని అసలేం జరిగిందని ప్రశ్నించగా.. గ్రీసు సమీపంలోకి రాగానే దూరంగా రక్షక దళాలు కనిపించడంతో మమ్మల్ని కాపాడమని అరిచాము. వారు తాడు వేసి మమ్మల్ని రక్షిస్తారని అనుకుంటే మమ్మల్ని కిందకి లాగేశారని అన్నాడు. 

సిరియాకు చెందిన మరో మృత్యుంజయుడు చెబుతూ.. వారు మా పడవకు ఒకపక్కన తాడు కట్టి బలంగా లాగడంతో బోటు మునిగిపోయిందని అన్నాడు. వీరిద్దరూ చెప్పినదాని బట్టి చూస్తే గ్రీసు తీర రక్షక బృందాల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ఏది ఏమైనా పొట్ట చేతపట్టుకుని జీవనబండిని లాగించాలని ఐరోపా వైపు పయనమైన శరణార్థుల్లో 104 మంది మినహాయిస్తే మిగిలిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.     

ఇది కూడా చదవండి: ఇదేం విచిత్రమైన పోటీ.. గిన్నిస్ రికార్డు కూడానా?  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top