‘ఘోస్ట్‌ గన్స్‌‌’ అంటే ఏంటో తెలుసా?.. చట్టం తెచ్చినా బైడెన్‌ ప్రభుత్వం ఫెయిల్‌

Ghost Gun Act: US President Biden Failure After Texas Incident - Sakshi

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పాతుకుపోయిన గన్‌ కల్చర్‌ తీవ్రతను టెక్సాస్‌ ఎలిమెంటరీ స్కూల్‌ కాల్పుల ఘటన మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. 2018లో ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్‌ డగ్లస్‌ హైస్కూల్‌ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు టెక్సాస్‌ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. 

టెక్సాస్‌ ఎలిమెంటరీ స్కూల్‌ కాల్పుల ఘటనలో ఇప్పటిదాకా 18 మంది చిన్నారులు, మరో ముగ్గురు మృతి చెందారు. పద్దెనిమిదేళ్ల నిందితుడిని అక్కడిక్కడే కాల్చి చంపేశాయి భద్రతా దళాలు. క్వాడ్‌ సదస్సు నుంచి తిరిగి అమెరికాకు చేరుకోగానే.. ఈ చేదు వార్తను వినాల్సి వచ్చింది అధ్యక్షుడు జో బైడెన్‌.  ఘటనపై టెక్సాస్‌ గవర్నర్‌ అబ్బట్‌ను వివరాలు అడిగి తెలుసుకుని.. సంతాపం ప్రకటించారు. అంతేకాదు ఘటనకు సంతాపసూచకంగా 28వ తేదీ వరకు జెండా అవనతం పాటించాలని కోరారు ఆయన. మరోవైపు వైస్‌ ప్రెసిడెంట్‌ కమలాహ్యారీస్‌ సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాల అధినేతలు సైతం ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు ‘ఘోస్ట్‌ గన్‌’ కారణమని పోలీసులు గుర్తించారు. 

ఘోస్ట్‌ గన్స్‌ అంటే..  
అక్రమ తుపాకుల్ని ‘ఘోస్ట్‌ గన్స్‌’గా పరిగణించొచ్చు. ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.  ఘోస్ట్‌ గన్‌లకు లైసెన్స్‌ ఉండదు. అలాగే వాటికి సీరియల్‌ నెంబర్‌ ఉండవు. త్రీడీ ప్రింట్‌ ద్వారా కూడా వీటిని తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇల్లీగల్‌ కావడంతో.. వీటి తయారీకి అవసరమయ్యే విడిభాగాలను కూడా అమ్మడానికి వీల్లేదు. కానీ, చట్టాల్లోని లొసుగులతో.. ఆన్‌లైన్‌లో కొందరు వీటి తయారీకి అవసరమయ్యే మెటీరియల్‌ను అమ్మేస్తున్నారు. ఉదాహరణకు.. తొమ్మిది ఎంఎం సెమీ ఆటోమేటిక్‌ పిస్టోల్‌కు సంబంధించిన విడిభాగాలను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేసే వీలుండేది. అక్కడి రాష్ట్రాల(ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా) స్థానిక చట్టాల దృష్ట్యా.. ఘోస్ట్‌ గన్స్‌ కలిగి ఉండడం స్వల్ప నుంచి కఠిన నేరంగా పరిగణించబడుతోంది. స్వల్పకాలిక నుంచి కఠిన జైలు శిక్ష, జరిమానా లేదంటే షూటింగ్‌ లైసెన్స్‌ రద్దు లాంటివి శిక్షలు అమలు అవుతున్నాయి.  

లెక్కకు మించి..
2021లో వివిధ నేరాల దర్యాప్తుల్లో భాగంగా.. సుమారు ఇరవై వేల ఘోస్ట్‌ గన్స్‌ను వివిధ దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. 2016లో దొరికిన అక్రమ ఆయుధాలతో పోలిస్తే.. ఇది పది రెట్లు ఎక్కువని వైట్‌హౌజ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. గన్‌ వయొలెన్స్‌ అమెరికాలో ఎంతకీ తగ్గడం లేదు. ఓ పరిశోధన సంస్థ ప్రకారం.. కేవలం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 140కి పైగా కాల్పుల ఘటనలు సంభవించాయి. కేవలం న్యూయార్క్‌ నగరంలోనే 2019 లో 47, 2020లో 150, 2021లో 150 ఘోస్ట్‌ గన్స్‌ దొరికాయి. 

అయితే దేశంలో కాల్పుల ఘటనలు పేట్రేగి పోతుండడంతో బైడెన్‌ ప్రభుత్వం ఘోస్ట్‌గన్స్‌ కట్టడికి ఏప్రిల్‌లో ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఘోస్ట్‌ గన్స్‌ నిషేధ చట్టం కోసం ఏడాది సమయం తీసుకుని.. రాజకీయంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. విడి భాగాల కంపెనీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయినా కూడా సాహసోపేతమైన అడుగు వేసింది బైడెన్‌ ప్రభుత్వం.  ఈ చట్టం ప్రకారం.. ఘోస్ట్‌ గన్స్‌ కలిగి ఉండడం కఠినాతికఠినమైన నేరంగా కిందకు వస్తుంది. అలాగే ఘోస్ట్‌ గన్స్‌ సరఫరా, విడిభాగాలను అందించే వాళ్లకు కూడా సమాన శిక్ష పడుతుంది. ఈ భయంతోఅయినా ఈ వ్యవహారానికి చెక్‌ పడుతుందని భావించారు. అయినప్పటికీ చట్టం అమలులో ఘోర వైఫ్యలాన్ని చవిచూస్తోంది బైడెన్‌ ప్రభుత్వం. నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఘోస్ట్‌ గన్స్‌ వ్యవహారం బయటపడుతున్నాయి. యథేచ్చగా ఘోస్ట్‌ గన్స్‌ మార్కెట్‌లో ఇల్లీగల్‌గా అమ్ముడుపోతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top