David Bennet Death: పెనువిషాదం. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూత

First Pig Heart Transplant Patient David Bennet Dies - Sakshi

వైద్య శాస్త్రంలో మరో  చారిత్రక ఘట్టం అవుతుందనుకున్నది కాస్త విషాదంగా మిగిలింది. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూశాడు. జనవరి 7వ తేదీన 57 ఏళ్ల డేవిడ్‌ బెన్నెట్‌ అనే వ్యక్తికి ఈ సర్జరీ జరిగింది. కానీ, ఆ ఆనందం రెండు నెలల్లోనే ముగిసింది.

మేరీల్యాండ్‌(అమెరికా)కు చెందిన డేవిడ్ బెన్నెట్‌కు రెండు నెలల క్రితం అమెరికాలోని మేరీల్యాండ్‌ ఆసుపత్రిలో గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను ఆయనకు విజయవంతంగా అమర్చారు. దీంతో దీనిని పెద్ద ముందడుగుగా భావించారు. 

కొన్ని రోజులుగా బెన్నెట్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. అయితే, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంగళవారం బెన్నెట్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తండ్రి మృతి విషయాన్ని బెన్నెట్ కుమారుడు బెన్నెట్ జూనియర్ నిర్ధారించారు. 

1984లోనూ ఇలాంటి ప్రయోగమే జరగ్గా అది కూడా విఫలమైంది. 1984లో బబూన్‌(కోతి జాతికి చెందినది) గుండెను ఓ నవజాత శిశువుకు అమర్చగా.. సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఆ పసికందు మాత్రం 20 రోజులే జీవించగలిగింది.  అయితే, ఈసారి పందిగుండె అమర్చుకున్న బెన్నెట్ రెండు నెలలు జీవించడం కొంత మెరుగైన ఫలితంగా భావించినా.. ఇప్పుడదీ విషాదమే అయ్యింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top