60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ | Find Work In 60 Days Or Leave, US Layoffs Put Indian Techies In A Pickle, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

May 21 2026 10:57 AM | Updated on May 21 2026 12:30 PM

Find Work In 60 Days Or Leave US Layoffs Put Indian Techies In A Pickle

పుట్టెడు కష్టాల్లో భారతీయ టెకీలు

అమెరికా టెక్ పరిశ్రమ వ్యాప్తంగా జరుగుతున్న తాజా ఉద్యోగ కోతలు టెక్‌ నిపుణులు గుండెల్లో గునపాల్లా దిగుతున్నాయి. ఉద్యోగం కోల్పోతే, దేశంలో నివసించే హక్కును కూడా కోల్పోవాల్సి వస్తుందేమోనన్న భయం వారిలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ ఇంజనీర్లు , సాఫ్ట్‌వేర్ డెవలపర్లు అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. క్లిష్టమైన కోడింగ్ రాశారు,  ఎన్నో టీమ్స్‌ను నడిపించారు. ఫలితంగా  విదేశాల్లో   జీవితం ఎంతో సురక్షితమైనదని నమ్మారు. అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని ఇళ్లు కొనుక్కున్నారు. కుటుంబాలను పెంచుకున్నారు. కట్‌ చేస్తే  ఇప్పుడు, వేలాది మందికి వచ్చిన ఒకే ఒక్క ఈమెయిల్ అంతటినీ మార్చేస్తోంది. అమెరికాలో ఉద్యోగం పోవడం అనేది ఒక కౌంట్‌డౌన్ షురూ అయినట్టే.

సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు మరోసారి ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మెటా (Meta) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు తన వనరులను మళ్లిస్తూ దాదాపు 8వేల  ఉద్యోగాలను తొలగించింది. అమెజాన్ కూడా పలు విడతల కోతల తర్వాత మరికొన్ని టీమ్స్‌ సైజ్‌ తగ్గిస్తోంది. టెక్ పరిశ్రమ ఏఐ, ఆటోమేషన్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో లింక్డ్‌ఇన్ సైతం ఇటీవలి ఉద్యోగులపై వేటు వేసింది  అమెరికాలోని మెజారిటీ భారతీయ టెక్ నిపుణులు H-1B వీసాలపై పనిచేస్తున్నారు. ఇవి నేరుగా వారి యజమానులతో (Employers) ముడిపడి ఉంటాయి. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం, వీసా స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న మరోయజమానిని వెతుక్కోవడానికి,సాధారణంగా 60 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఒకవేళ వారు విఫలమైతే, దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.

 ఉద్యోగం కోల్పోవడం అంటే కేవలం వృత్తి పరమైన నష్టం  మాత్రమే కాదు, ఇమ్మిగ్రేషన్, ఇంటి లోన్ల చెల్లింపులు, పిల్లల పాఠశాలల అడ్మిషన్లు, ఆరోగ్య రక్షణ, కుటుంబ నిర్ణయాలతో కూడిన  రేస్‌లా మారుతుంది. ఇప్పటికే చాలా మంది భారతీయులు గ్రీన్ కార్డ్‌ల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు. కొందరికి అమెరికాలోనే పుట్టిన పిల్లలు ఉన్నారు. మరికొందరు తాము దీర్ఘకాలం అక్కడే ఉంటామనే నమ్మకంతో ఇళ్లు కొనుగోలు చేశారు. ఉద్యోగం పోవడంతో ఆ ప్లాన్లన్నీ రాత్రికి రాత్రే అనిశ్చితిలోకి వెళ్లిపోతున్నాయి.

ఇక ఉద్యోగాలు కోల్పోయిన చాలామంది భారతీయ కార్మికులు అమెరికాలో మరికొంత కాలం కొనసాగడానికి తాత్కాలిక ప్రత్యామ్నాయాలను వెతుక్కోక తప్పని పరిస్థితి.  దీనికి B-2 విజిటర్ వీసాకు మారడమే పరిష్కారం. తద్వారా మరో ఉద్యోగం వెతుక్కునే లోపు అక్కడ మరికొన్ని నెలలు ఉండే అవకాశం లభిస్తుంది.

60 రోజుల H-1B నిబంధన అంటే ఏమిటి?
యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నిబంధనల ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన H-1B కార్మికులకు తమ తదుపరి నిర్ణయాన్ని చూసుకోవడానికి సాధారణంగా 60 రోజుల గ్రేస్ పీరియడ్ (లేదా వారి I-94 హోదా గడువు ముగిసే వరకు, ఏది ముందైతే అది) లభిస్తుంది. ఈ సమయంలో తమ వీసాను స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న వేరే యజమానిని వెతుక్కోవచ్చు, వేరే వీసా కేటగిరీకి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా అమెరికా విడిచి వెళ్లడానికి సిద్ధం కావచ్చు. ఈ 60 రోజుల గడువు సాధారణంగా ఉద్యోగి యొక్క చివరి పని దినం (Last working day) నుండి ప్రారంభమవుతుంది,  అంతేకానీ చివరి జీతం బ్యాంక్ ఖాతాలో జమ అయినప్పటి నుండి కాదు అనేది గుర్తించాలి.

సడన్‌గా ఉద్యోగాలు కోల్పోయిన విదేశీ నైపుణ్యం కలిగిన కార్మికులకు కొంత ఉపశమనం కలిగించడానికి ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. కానీ వాస్తవానికి, టెక్ పరిశ్రమలోనే నియామకాలు మందగించినప్పుడు రెండు నెలల సమయం చాలా వేగంగా గడచిపోతుంది. కొత్త స్పాన్సర్‌ను కనుగొనడం, ఉద్యోగం రావడం, వీసా ట్రాన్స్‌ఫర్‌ అంత ఈజీకాదు. అందుకే ఉద్యోగాలు కోల్పోయిన  వారు  Form I-539 దాఖలు చేయడం ద్వారా తాత్కాలికంగా B-1 లేదా B-2 విజిటర్ వీసాకు మారాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సలహా ఇస్తుంటారు.

కెనడా, యూరప్‌ వైపు మొగ్గు
దశాబ్దాలుగా అమెరికా అంటే కెరీర్ వృద్ధి, అధిక జీతాలు మరియు ప్రపంచ స్థాయి గుర్తింపునకు చిహ్నంగా ఉండేది. కానీ వరుస లేఆఫ్స్, వీసాపై ఆధారపడటం, ఇమ్మిగ్రేషన్‌పై వస్తున్న రాజకీయ విమర్శలు ,  AI ఆధారిత మార్పులు చాలా మంది నిపుణులను తమ భవిష్యత్తు గురించి పునరాలోచించుకునేలా చేస్తున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే లక్షా పదివేలకు పైగా టెకీలు ఉద్యోగాలు కోల్పోయారు. 2025లో ఆమోదించిన H-1B పిటిషన్లలో అత్యధిక శాతం భారతీయులవే ఉన్నాయి. కానీ ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో  చాలా మంది భారతీయులు తమ 'అమెరికన్ డ్రీమ్' ఆశలను వదిలేసుకుంటున్న పరిస్థితి.  ఇటీవలి ఒక 'బ్లైండ్' (Blind) పోల్ ప్రకారం, అమెరికాలోని భారతీయ నిపుణులలో దాదాపు సగం మంది తాము ఉద్యోగం కోల్పోతే భారతదేశానికి తిరిగి రావడానికి మొగ్గు చూపుతామని తెలిపారు. మరికొందరు కెనడా , యూరప్ వైపు చూస్తున్నారు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement