Europe Heatwave: మండిపోతున్న యూరప్‌.. చరిత్రలో తొలిసారి

Europe Heatwave: Temperature hits 40 Degress in UK first Time - Sakshi

ఠారెత్తిస్తున్న ఎండలు

బ్రిటన్‌ చరిత్రలోనే తొలిసారిగా 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్‌ల్లోనూ తీవ్ర ఎండలు, కార్చిచ్చులు

లండన్‌: యూరప్‌ను ఎండలు అల్లాడిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం లింకన్‌షైర్‌లోని కోనింగ్స్‌బైలో ఏకంగా 40.3 డిగ్రీలు, హీత్రూలో 40.2 డిగ్రీలు నమోదైంది! దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరిగా అసాధారణ స్థాయిలో ఎండలు మండిపోయాయని వాతావరణ విభాగం తెలిపింది. సోమవారం రాత్రి నమోదైన 26 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఒక రికార్డేనని తెలిపింది. లండన్‌తోపాటు ఇంగ్లండ్‌లోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ విభాగం ప్రమాద హెచ్చరికలు చేసింది.

సోమవారం జారీ చేసిన రెడ్‌ వార్నింగ్‌ను అధికారులు మంగళవారం కూడా కొనసాగించారు. అత్యధిక ఉష్ణోగ్రతలతో తూర్పు లండన్‌లోని వెన్నింగ్టన్‌ గ్రామంలో గడ్డికి అంటుకున్న మంటలు ఇళ్లకు వ్యాపించాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. యూరప్‌లో పలు దేశాలు ఎండ దెబ్బకు అల్లాడుతున్నాయి. ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావం ఫ్రాన్సు, స్పెయిన్, జర్మనీ, బెల్జియం దేశాల్లో ఎక్కువగా ఉంది. ఫ్రాన్సు, స్పెయిన్, పోర్చుగల్, గ్రీసుల్లో అడవులను వారం రోజులుగా మంటలు దహించి వేస్తున్నాయి.

ఇంగ్లండ్‌లో లండన్‌లోని కేంబ్రిడ్జిలో 2019లో నమోదైన 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటిదాకా రికార్డు. వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు జనం జలాశయాలను ఆశ్రయిస్తున్నారు. రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కువ సేపు ఎండ ప్రభావానికి గురైతే అనారోగ్యం తప్పదంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వేసవి తీవ్రత నేపథ్యంలో కొన్ని చోట్ల ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో రహదారులను మూసివేశారు.

కొన్ని రైళ్లను ఆలస్యంగా నడిపారు. కొన్నిటిని రద్దు చేశారు. 40 డిగ్రీల ఎండలుంటే రైలు పట్టాలపై ఉష్ణోగ్రతలు 50, 60, 70 డిగ్రీల వరకు వెళ్తుంది. అలాంటి సమయాల్లో పట్టాలు అతుక్కుపోయి, రైళ్లు పట్టాలు తప్పే ప్రమాదముందని రైల్వే శాఖ తెలిపింది. ఎండలతో తలెత్తే డిమాండ్‌ కారణంగా ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నీటి సరఫరా సంస్థలు తెలిపాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top